ACB Raids: నిర్మల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మార్కెటింగ్ శాఖ అధికారి
Telangana News | నిర్మల్ జిల్లాల్లో ఏసీబీ చేతికి ఓ అవినీతి అధికారి చిక్కాడు. లైసెన్స్ కోసం లంచం డిమాండ్ చేసిన అధికారిని బాధితుడు ఏసీబీ అధికారులకు పట్టించాడు.
నిర్మల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మార్కెటింగ్ శాఖ అధికారి
ఆదిలాబాద్ లోని మార్కెటింగ్ శాఖ అధికారి ఇళ్లలోనూ ఎసిబి సోదాలు
నిర్మల్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ దాడుల్లో ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో స్థానికంగా చర్చనీయంశంగా మారింది. ఆదిలాబాద్ లోనూ మార్కెటింగ్ ఏడీ గా పనిచేసి... నిర్మల్ కు బదిలీపై వెళ్ళిన ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రహ్మన్వాడలో గల ఆయన నివసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు జరపడం స్థానికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
లైసెన్స్ కోసం లంచం డిమాండ్
ఆ వివరాలిలా ఉన్నాయి.. నిర్మల్ మార్కెటింగ్ అధికారిగా శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో దాడ్వాయి లైసెన్స్ కోసం కుమ్మరి వెంకటేష్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు గానూ అతడిని శ్రీనివాస్ పదివేల రూపాయలను డిమాండ్ చేయగా... బాధితుడు వెంకటేష్ అభ్యర్ధన మేరకు ఏడూ వేల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఇదే క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వెంకటేష్ వద్ద నుంచి శ్రీనివాస్ ఏడువేల రూపాయలు తీసుకుంటున్న సమయంలో బుధవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
సిలికాన్ టెస్ట్ నిర్వహించి శ్రీనివాస్ ను కరీంనగర్ కోర్ట్ కు తరలించారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ ఆయన నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులను విచారించి పలు పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్ లు, ఆస్తుల వివరాలను తెలుసుకుని సమగ్ర నివేదిక తయారు చేసుకున్నారు. పూర్తి విచారణ జరిగిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.