ప్రాణాలు తీసిన ఎస్సై ప్రిలిమ్స్- యువతి, యువకుడు మృతి
ఇటీవల జరిగిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో తక్కువ మార్కులు వస్తాయన్న మనస్తాపంతో ఖమ్మంలో ఓ యువకుడు, ఎస్సై పరీక్ష సరిగ్గా రాయలేదని కామారెడ్డిలో మరో యువతి సూసైడ్ చేసుకున్నారు.
ఈ కాలంలో కొంతమంది యువతీ యువకులు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న కష్టం వచ్చినా దానిని ఎదుర్కోలేక పోతున్నారు. ముందూ వెనకా ఆలోచించకుండా క్షణ కాలంలో అతి పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని అర్థాంతరంగా ముగుస్తున్నారు. ఖమ్మంలో ఓ యువకుడు, కామారెడ్డిలో ఓ యువతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.
ఎస్సై ప్రిలిమ్స్ లో తక్కువ మార్కులు
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తాళ్లూరి వెంకటాపురం గ్రామానికి చెందిన అరిగెల రాజ ప్రకాష్(24) నాలుగు నెలల క్రితం కవిత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన వీరిద్దరూ ఖమ్మం బుర్హాన్ పురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఎస్సై ఉద్యోగానికి సిద్ధం అవుతున్నారు. భద్రాచలంలో రాజ ప్రకాష్, కవిత ఖమ్మంలో గత ఆదివారం జరిగిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష రాశారు. ఆ పరీక్ష ఆన్సర్ కీ రాగా.. ఇద్దరూ కలిసి ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకున్నారు. తనకు తక్కువ మార్కులు వస్తున్నట్లుగా గుర్తించిన రాజ ప్రకాష్.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎంతో కష్టపడి చదివినా తాను పాస్ కాలేక పోతున్నానని తీవ్రంగా కలత చెందాడు. తాను ఇక బతకడం వృథా అని బాధపడుతుండగా.. రాజ ప్రకాష్ భార్య కవిత తనకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. మరింత శ్రద్ధగా చదివి మరోసారి ప్రయత్నం చేయవచ్చని నచ్చజెప్పింది.
బయటకు వెళ్లిన భార్య.. అంతలోనే
ప్రేమ వివాహం కావడం, ఇద్దరికీ ఉద్యోగాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాజ ప్రకాష్ ఆవేదన చెందాడు. కవిత ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో తీవ్ర మనస్తాపంతో ఉన్న రాజ ప్రకాష్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. బయట నుంచి ఇంటికి రాగానే కవితకు ఉరివేసుకున్న ప్రకాష్ కనిపించాడు. కవిత ఏడుస్తూ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి చూశారు. అప్పటికే రాజ ప్రకాష్ ప్రాణాలు కోల్పోయాడు. వివాహమైన నాలుగు నెలలకే భర్త ఆత్మహత్య చేసుకోవడంతో భార్య కవిత కన్నీరుగా మున్నీరుగా రోదించడం కలిచివేసింది.
కామారెడ్డిలో మరో యువతి
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో ఎస్సై రాత పరీక్ష సరిగా రాయలేనని ఓ యువతి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామానికి చెందిన పంచశీల(20) యువతి హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఎస్సై పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అయింది. ఈ నెల 7వ తేదీన నిర్వహించిన ఎస్సై రాత పరీక్ష సరిగా రాయలేనని పరీక్షలో ఫెయిల్ అవుతానేమోనని మనస్థాపం చెందింది. నిన్న(మంగళవారం) ఉదయం హైదరాబాద్ నుంచి బస్సులో కామారెడ్డి వైపు వస్తూ మార్గ మధ్యంలో బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ స్టేజీ వద్ద దిగింది. అక్కడి నుంచి గ్రామ పెద్ద చెరువు వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
యువతి ఆత్మహత్య పాల్పడటానికి ముందు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడింది. చాలా నిరాశతో మాట్లాడినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. యువతి సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా జంగంపల్లి పెద్ద చెరువు వద్ద గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. యువతి మృతదేహాన్ని స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బిక్కనూర్ పోలీసులు తెలిపారు.