Samarlakota Crime News: సామర్లకోటలో యువతి దారుణ హత్య, యువకుడు ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమేనా?
Samarlakota Crime News: కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణం జరిగింది. పనసపాడులో యువతి మృతదేహం లభ్యం కాగా అదే రోజు మధ్యాహ్నం సమీప ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై యువకుడు శవమై కనిపించాడు.

Samarlakota Crime News: కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. సామర్లకోట పనసపాడులోని పంటకాలువ వద్ద కొంతుకోసిన యువతి మృతదేహం లభ్యమైంది. అదే రోజు మధ్యాహ్నం ఇదే సామర్లకోటలోని హుస్సేన్‌పురం వద్ద రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడి మృతదేహం దొరికింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించగా పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తును ప్రారంభించారు..
దుర్గాడకు చెందిన యువతిగా గుర్తించిన పోలీసులు..
సామర్లకోట మండలం పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి సమీపంలోని పంట కాలువ వద్ద ఓ యువతి మృతదేహం ఉందని అందిన సమాచారం మేరకు సామర్లకోట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. యువతి మృతదేహం గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన గొల్లపల్లి దీప్తి(17) గా నిర్ధారించారు. దీప్తి దసరా సెలవులకు సామర్లకోటలోని బంధువుల ఇంటికి వచ్చింది. మంగళవారం రాత్రి స్థానికంగా ఉన్న ఆలయంలో కుంకుమ పూజ నిమిత్తం వెళ్లగా వారు తిరిగి వచ్చేసరికి దీప్తి ఇంటి వద్ద లేకపోవడంతో అంతా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది.. దీంతో దుర్గాడలోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఉదయం సామర్లకోటలోని పనసపాడు వద్ద పంటకాలువ గట్టున ఓ యువతి మృతదేహం ఉందన్న వార్త తెలియడంతో అక్కడికివెళ్లి చూసిన బంధువులు షాక్‌కు గురయ్యారు. యువతి గొంతు కోసి ఉండడం ఎవరైనా హత్య చేసి పడేశారా అన్న అనుమానాలు రేకెత్తాయి.. అయితే యువతి మృతదేహం వద్ద ఓ క్యాప్ పడి ఉంది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం...
సామర్లకోట పనసపాడులో యువతి మృతదేహం లభ్యం అయిన కొన్ని గంటల వ్యవధిలో సామర్లకోట హుస్సేన్‌పురం వద్ద రైల్వేట్రాక్‌పై ఓ యువకుడి మృతదేహం ఉందన్న సమాచారంతో పోలీసులను పరుగులు పెట్టించింది. పోలీసుుల ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఆ యువకుడి మృతదేహం గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన కొమ్ము అశోక్(25) గా గుర్తించారు. యువకుడి గుండుతో ఉండగా యువతి మృతదేహం వద్ద లభ్యం అయిన క్యాప్ ఈ యువకుడిదే అని ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు మృతులు దీప్తి, అశోక్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న దీప్తి, అశోక్...?
గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన దీప్తి కాకినాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది.. ఇక ఇదే ప్రాంతానికి చెందిన కొమ్ము అశోక్, దీప్తి చిన్ననాటి నుంచి స్నేహితులని తెలుస్తోంది. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని, ప్రేమ వ్యవహారమే ఈ దారుణ ఘటనకు కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును చేపట్టారు. అయితే యువతి దీప్తి మృతదేహం వద్ద అశోక్ క్యాప్ లభ్యం కావడం, దీనికి తోడు వీరిద్దరి సెల్‌ఫోన్ కాల్స్ డేటాను పరిశీలించిన పోలీసులు వీరిద్ధరి మధ్య చాలా ఫోన్ కాల్స్ వెళ్లాయని తెలిపారు. ప్రేమ వ్యవహారంలో ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు వచ్చి దీప్తి సామర్లకోటలోని బంధువుల ఇంటికి వెళ్లిందని తెలిసి ఇక్కడికి వచ్చి యువకుడే హత్య చేసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. లేక వీరిద్ధరిని ఎవ్వరైనా హత్యచేశారా.. అన్న అనుమానాలు స్థానికంగా వినిపిస్తున్నాయి.. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...
గొల్లప్రోలు మండల దుర్గాడలో ఉద్రిక్త పరిస్థితి..?
ఈ ఘటనలో మృతులిద్ధరూ గొల్లప్రోలు మండలం దుర్గాడ కావడం, యువతిని చంపి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న వార్తలు కలకలం రేపడంతో దుర్గాడలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ జంట మృతదేహాల కేసులో పోలీసులు సమగ్రదర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.





















