Rotten Chicken: ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
Hyderabad News: సికింద్రాబాద్‌లోని బేగంపేట ప్రకాశ్ నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి నుంచి మద్యం దుకాణాలు, పాస్ట్ ఫుడ్ సెంటర్లకు తరలిస్తున్నట్లు గుర్తించారు.
Rotten Chicken Siezed In Hyderabad: మనం సరదాగా బయటకు వెళ్లినప్పుడు, రెస్టారెంట్లు, హోటళ్లు, కర్రీ పాయింట్లలో చికెన్ లాగించేస్తుంటాం. ఇక వైన్ షాపులకు వెళ్తే ముక్క లేనిదే పని జరగదు. మద్యంతో పాటు చికెన్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఇది చూస్తే ఇకపై అలా తినాలంటేనే భయపడతారు. హైదరాబాద్ నగరంలో కుళ్లిన చికెన్ గోడౌన్లపై జీహెచ్ఎంసీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా గోడౌన్లు నిర్వహిస్తూ.. కుళ్లిన చికెన్‌ను సరఫరా చేస్తోన్న వ్యక్తిని పట్టుకున్నారు. చికెన్ సెంటర్‌ను సీజ్ చేశారు.
సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలోని బేగంపేట్, ప్రకాశ్ నగర్‌లోని బాలయ్య చికెన్ సెంటర్‌లో జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 700 కిలోల కుళ్లిన చికెన్‌ను గుర్తించి షాక్ అయ్యారు. ఫుడ్ లైెసెన్స్ లేకుండా గోడౌన్ నుంచి చికెన్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హోల్ సేల్ చికెన్ షాపు అని చెప్పి రెగ్యులర్ కస్టమర్లకు తక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిపారు. సిటీ ప్రాంతంలోని అన్ని వైన్ షాపులకు చౌకగా రూ.50కు కేజీ విక్రయిస్తున్నట్లు చెప్పారు. దీంతో అన్నీ వైన్ షాపుల వాళ్లు, దగ్గర్లోని హోటల్స్ వారు ఇక్కడి నుంచి చికెన్ తీసుకెళ్లి ఘుమఘుమలాడే చికెన్ చేసి అమ్ముతున్నట్లు వెల్లడించారు. కుళ్లిన చికెన్ తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కుళ్లిన కోడి మాంసం, కొవ్వు పదార్థాలు, కోడి ఎముకలకు కెమికల్స్ కలిపి పాస్ట్ ఫుడ్ సెంటర్లు, మద్యం దుకాణాలకు అమ్ముతున్నట్లు నిర్దారించారు. బాలయ్య చికెన్ సెంటర్‌ను సీజ్ చేసిన అధికారులు, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కుళ్లిన చికెన్ అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.