Stock Market Update: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు ఎఫెక్ట్- భువనేశ్వరికి ఐదు రోజుల్లోనే రూ.584 కోట్ల లాభం
Nara Bhuvneshwari: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించింది. త్వరలోనే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏలో కూడా చేరారు. ఈ ప్రభావంతో భువనేశ్వరి బాగా లాభపడ్డారు.
Nara Chandrababu Naidu: ఈ వారం స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడుడొడుకులు చూసింది. ఒక్కరోజులో వేల పాయింట్లు పెరగడం & పడిపోవడంతో ఇన్వెస్టర్లు రోలార్ కోస్టర్ రైడ్ చేశారు. అలాంటి అస్థిర మార్కెట్‌లోనూ ఒక FMCG స్టాక్ శ్రీహరికోట రాకెట్‌లా పైపైకి దూసుకెళ్లింది. దాని స్పీడ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబం వందల కోట్ల రూపాయలు ఆర్జించింది.
52 వారాల రికార్డ్ గరిష్టం
ఆ FMCG కంపెనీ పేరు హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods). ఈ కంపెనీ షేర్లు ఈ రోజు కూడా 10 శాతం పెరిగి రూ.661.25 దగ్గర అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. ఇది, ఈ స్టాక్‌కు కొత్త 52 వారాల గరిష్ట స్థాయి. ఈ నెల 04వ తేదీన (ఎన్నికల ఫలితాల రోజున) స్టాక్ మార్కెట్ పేకమేడలా కుప్పకూలినప్పుడు కూడా ఈ స్టాక్ పైకి ఎగిరింది. హెరిటేజ్ కంపెనీ షేర్లు గత 5 సెషన్లలోనే దాదాపు 56 శాతం లాభపడ్డాయి.
వరుసగా 3 రోజులుగా అప్పర్ సర్క్యూట్
ఈ ఏడాది మే 31వ తేదీన, స్టాక్ హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర రూ. 402.90గా ఉంది. ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు, జూన్ 03న (సోమవారం) షేర్ ప్రైస్ రూ.424.45కు చేరింది. జూన్ 05న (బుధవారం), ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ఈ స్టాక్ ఏకంగా 20 శాతం పెరిగింది. ఇప్పుడు రూ.661.25 దగ్గర (Heritage Foods Share Price Today) ఉంది. ఈ షేర్ ధర గత 3 రోజుల నుంచి అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అవుతోంది.
కేవలం 5 రోజుల్లో రూ.579 కోట్లు
చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరికి హెరిటేజ్ ఫుడ్స్‌లో 24.37 శాతం వాటా ఉంది. ఆమె పోర్ట్‌ఫోలియోలో ఈ కంపెనీకి చెందిన 2,26,11,525 షేర్లు ఉన్నాయి. గత 5 రోజులుగా కంపెనీ షేర్ ధరలు భారీగా పెరగడంతో నారా భువనేశ్వరి వాటా విలువ ఏకంగా రూ.584 కోట్లు పెరిగింది.
హెరిటేజ్ ఫుడ్స్‌లో నారా కుటుంబానికి గణనీయమైన వాటా ఉంది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ పాత్ర కీలకంగా మారింది. ఇప్పుడు, కొత్త కేంద్ర ప్రభుత్వంలో టీడీపీకి విశేష ప్రాధాన్యత లభించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాజకీయ పరిణామాల నుంచి హెరిటేజ్ ఫుడ్స్ లాభపడుతుందన్న అంచనాలతో ఈ కంపెనీ షేర్ ధర పెరుగుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: గ్రేటర్ విశాఖ మునిసిపల్ బాండ్లు, 8 శాతం పైగా వడ్డీ! - పెట్టుబడి పెడతారా?