Viveka Murder Case: సాక్షుల వరుస మరణాలు - తనకు సెక్యూరిటీ పెంచాలని ఎస్పీని కోరిన దస్తగిరి
వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కడప ఎస్పీ అశోక్ కుమార్ ను కలిశారు. తనకు భద్రత పెంచాలని, ప్రాణాలకు ముప్పు ఉందని ఎస్పీని కోరారు.

Viveka Murder Case | కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనకు భద్రత పెంచాలని ఎస్పీని కోరారు. కడప ఎస్పీ ఆఫీసుకు వెళ్లిన దస్తగరి.. వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారని తనకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని భావిస్తున్నట్లు దస్తగరి చెప్పారు. వివేకా హత్య కేసుకు సంబంధించి ముఖ్యమైన సాక్షి వాచ్‌మెన్ రంగన్న ఇటీవల చనిపోయారు. ఆయన మృతిపై భార్య అనుమానం వ్యక్తం చేయగా, దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు.
వాచ్‌మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం
వివేకా కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగన్న ఇటీవల చనిపోయారు. కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. పులివెందుల భాకరాపురం శ్మశాన వాటికలో రంగన్న మృతదేహానికి మార్చి 8న రీపోస్టుమార్టం నిర్వహించారు. మంగళగిరి, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఆయన మృతదేహంపై ఏమైనా గాయాలున్నాయా, అనుమానస్పద గుర్తులు ఉన్నాయా అని పరిశీలించారు.
సాక్షుల వరుస మరణాలు
వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న గంగాధర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అభిషేక్‌రెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, వాచ్‌మన్ రంగన్న మరణించారు. అయితే వీరివి అనుమానాస్పద మరణాలు అని, వీరి మృతి వెనుక కేసుతో ప్రమేయం ఉన్న వారి హస్తం ఏమైనా ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షుల వరుస మరణాలపై విచారణ చేపట్టామని కడప ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. రంగన్న మృతి తరువాత వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలపై సిట్ ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, 10 మంది కానిస్టేబుళ్లు ఈ సిట్ బృందంలో ఉంటారు. సాక్షులు కోరితే వారికి భద్రత కల్పిస్తామని ఇటీవల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. దాంతో తనకు భద్రత పెంచాలని, తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని దస్తగిరి ఎస్పీ ఆఫీసుకు వెళ్లి కోరారు.






















