Train Journey: థర్డ్ ఏసీ టికెట్‌తో ఫస్ట్ ఏసీలో ప్రయాణం చేయొచ్చు, దీనికోసం ఏం చేయాలి?
Indian Railway Rules: థర్డ్ ఏసీ టికెట్ తీసుకుని సెకండ్ లేదా ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణిస్తే కొంత జరిమానా చెల్లించవలసి ఉంటుంది. కానీ, స్టోరీ అక్కడితో ఆగిపోదు.
Train AC Coach Ticket: భారతదేశంలో, రైలు ప్రయాణాల మీద ఆధారపడి పెద్ద సంఖ్యలో ప్రజలు జీవనం గడుపుతున్నారు. విహార యాత్రలకు, స్వగ్రామాలకు వెళ్లడం కోసం అప్పడప్పుడు రైళ్లలో ప్రయాణించే వాళ్లు, వ్యాపారం లేదా ఉద్యోగం కోసం ప్రతిరోజూ జర్నీ చేసేవాళ్లు.. ఇలా రోజూ కోట్ల మంది జనం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజల కోసం భారతీయ రైల్వే ప్రతిరోజూ వేలాది రైళ్లను నడుపుతుంది. దేశంలో ఎవరైనా ఎక్కువ దూరం ప్రయాణించవలసి వస్తే, రైలులో వెళ్లడానికి మొగ్గు చూపుతారు. రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా ఉండడమే దీనికి కారణం.
ట్రైన్ టిక్కెట్ రూల్స్
రైలులో ప్రయాణించే విషయంలో రైల్వే శాఖ కొన్ని నిబంధనలు రూపొందించింది. ప్రయాణికులందరూ ఈ రూల్స్‌ను పాటించాల్సిందే. ఈ రూల్స్‌లో ఒకటి రైలు టిక్కెట్లకు సంబంధించింది. ఈ రూల్ ప్రకారం, మీరు టికెట్ బుక్ చేసుకున్న రైలు కోచ్‌లోనే మీరు ప్రయాణించాలి. అంటే.. థర్డ్ ఏసీ టికెట్ తీసుకుంటే థర్డ్ ఏసీ బోగీలోకి మాత్రమే ఎక్కాలి. థర్డ్ ఏసీ టిక్కెట్‌తో ఫస్ట్ లేదా సెకండ్ ఏసీ బోగీల్లో ప్రయాణం చేయకూడదు.
భారతీయ రైల్వే రూల్స్ ప్రకారం, మీరు ఒక తరగతి ప్రయాణం కోసం టికెట్ (Train Ticket Class) తీసుకుని, అంతకంటే ఎగువ తరగతి బోగీలో (higher class coach) ప్రయాణించలేరు. కానీ, మీరు ఇదే పని చేస్తే, TTE (Travelling Ticket Examiner) వచ్చినప్పుడు ఫైన్ కట్టించుకుంటాడు. సెకండ్ ఏసీ టిక్కెట్ తీసుకుని ఫస్ట్ ఏసీలో ప్రయాణించాలన్నా ఇదే వర్తిస్తుంది.
థర్డ్ ఏసీ టికెట్ తీసుకుని సెకండ్ ఏసీ లేదా ఫస్ట్ ఏసీ బోగీలోకి ఎక్కినందుకు, TTE మీకు రూ. 250 జరిమానా విధిస్తాడు. అంతేకాదు, రైలు బయలుదేరిన ప్రదేశం నుంచి TTE మిమ్మల్ని పట్టుకున్న స్టేషన్ వరకు ఫస్డ్ ఏసీ/ సెకండ్ ఎసీకి- థర్డ్ ఎసీ టిక్కెట్ మధ్య ఛార్జీ వ్యత్యాసాన్ని కూడా వసూలు చేయవచ్చు. ఫైన్ కట్టేశాం కదా, ఇక అదే బోగీలో జర్నీ కంటిన్యూ చేయొచ్చు అనుకోవద్దు. ఫైన్ కట్టిన తర్వాత TTE మిమ్మల్ని తిరిగి థర్డ్ AC కోచ్‌కి పంపుతాడు. ఒకవేళ, ఫస్డ్ ఏసీ/ సెకండ్ ఏసీలో సీట్లు ఖాళీగా ఉంటే, TTE టిక్కెట్ వ్యత్యాసం వసూలు చేసి, మీరు అదే బోగీలో ప్రయాణించేందుకు అనుమతిస్తాడు. అంటే, ఖాళీ ఉంటేనే మీకు ఫస్ట్ లేదా సెకండ్ ఏసీ బోగీలో సీటు దొరుకుతుంది లేదా థర్డ్ ఏసీకి వెళ్లాలి.
వెయిటింగ్ టికెట్‌తో ప్రయాణించలేరు
భారతీయ రైల్వే టిక్కెట్ నిబంధనలను మరింత కఠినంగా మార్చింది. ఇప్పుడు, మీరు రైల్వే వెయిటింగ్ టికెట్ తీసుకొని నాన్-రిజర్వ్‌డ్ లేదా రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణించకూడదు. TTE పట్టుకుంటే మీకు జరిమానా విధిస్తారు. ఇది మాత్రమే కాదు, TTEకి కోపం వస్తే మిమ్మల్ని ప్రయాణం మధ్యలోనే రైలు నుంచి కూడా దించేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: టీటీఈతో మాట్లాడి టికెట్ లేకుండా రైలు ఎక్కితే జరిమానా ఉండదా?