US in Afghanistan: అమెరికా 'సూపర్ పవర్'కు ఇది అంతమా? యూఎస్ 'రన్ రాజా రన్'
అఫ్గానిస్థాన్.. తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. మరోవైపు తమ పౌరులను అక్కడి నుంచి తరలించడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితులను చూస్తుంటే చాలా చిత్రంగా ఉంది. మొన్నటివరకు తాలిబన్లను వణికించిన అమెరికా.. ఇప్పుడు అదే తాలిబన్ల నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు ఆత్మరక్షణలో పడింది. దీని ప్రపంచానికి సూపర్ పవర్ అయిన అమెరికాకు తగిలిన ఎదురుదెబ్బగా పరిగణించాలి.
అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. అమెరికన్ బలగాలను అకస్మాత్తుగా అఫ్గానిస్థాన్ నుంచి ఉపసంహరించుకోవాలని బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. అంతేకాకుండా 'ఇది స్పష్టంగా సైగాన్ కాదు'. అని వ్యాఖ్యానించారు.
ఏంటీ సైగాన్..
1975 ఏప్రిల్ 30న ఉత్తర వియత్నాం దళాలు సైగాన్ నగరాన్ని ఆక్రమించటం వల్ల అమెరికా ఇలాంటి పరాభవాన్నే ఎదుర్కొంది. అప్పుడు కూడా యూఎస్ తన సిబ్బందిని సైగాన్‌లోని తన రాయబార కార్యాలయం నుంచి తరలించడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం అఫ్గాన్ లోనూ ఇదే పరిస్థితి రావడం యాదృచ్ఛికం. అప్పుడు ఆ ఘటనకు కారణం కమ్యూనిస్టులు కాగా ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదులు కారణమయ్యారు. కానీ అమెరికా మరోసారి అలాంటి భయానక వాతావరణం నుంచి తన సేనలను ఉపసంహరించుకుని వెళ్లిపోతుంది.
సూపర్ పవర్ పతనం..
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత శక్తిమంతమైన సైనిక శక్తిగా మారిన అమెరికా మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి గురించి చాలా మంది చిన్నగా మాట్లాడుతున్నారు. కొందరు దీనికి అమెరికాకు సంబంధం ఏంటి అంటున్నారు. మరికొందరు అమెరికా 'ప్రతిష్ట' కోల్పోవడం గురించి మాట్లాడుతున్నారు. అయితే అంత సులభంగా తాలిబన్లు అఫ్గానిస్థాన్ ను ఎలా దక్కించుకున్నారో గమనించాలి.
అమెరికా తన బలగాల ఉపసంహరణకు కట్టుబడి మాత్రమే ఇలా చేసిందని బైడెన్ ప్రభుత్వం చెబుతోంది. అయితే అఫ్గాన్ సైన్యం ఏ మేరకు తాలిబన్లను నిలువరించగలదో అన్న విషయంపై మాత్రం బైడెన్ ప్రభుత్వం సరైన అంచనాకు రాలేదు. ఇది కచ్చితంగా అమెరికాకు ఓ 'అవమానం'. ఇది వ్యూహాత్మక వైఫల్యం.
అయితే ఇన్నేళ్లుగా అఫ్గానిస్థాన్ లో అమెరికా ఖర్చు చేసిన 'ట్రిలియన్ డాలర్లు' వ్యర్థమైనట్లే. 20 సంవత్సరాల యుద్ధానికి సంబంధించిన మొత్తం ఖర్చుగా దీన్ని అమెరికా పేర్కొంది. తన బలగాలను అఫ్గాన్ లో ఉంచడానికి, వాటి నిర్వహణకు ఈ మొత్తం ఖర్చైంది.
అన్నీ ఇంతేనా..
రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల కూటమిపై యుఎస్, మిత్రరాజ్యాల నిర్ణయాత్మక విజయం తర్వాత అమెరికా ఏ యుద్ధాన్ని పూర్తిగా గెలవలేదు. కొరియన్ యుద్ధం (1950 జూన్- 1953 జూలై) ప్రతిష్టంభనతో ముగిసింది. అయితే ఆ యుద్ధ ఫలాలు ఇప్పటికీ రెండు కొరియన్ దేశాలు అనుభవిస్తున్నాయి.
రెండు దశాబ్దాల తరువాత, ఇరాక్ లో మరొక సుదీర్ఘ యుద్ధం సాగింది. సద్దాం హుస్సేన్‌ను చంపాలని అమెరికా చేసిన ప్రయత్నాలు ఇరాక్ లో ఎన్నో అల్లర్లకు, అహింసకు కారణమయ్యాయి. అయితే అమెరికా తన సొంత దేశంలో ఉన్న సమస్యలను వదిలి ఇతర దేశాల్లో వేలు పెడుతుందనే అపవాదులూ వినిపించాయి. సిరియాలో పరాజయాలు, లిబియాలో అంతర్యుద్ధం, ముమ్మార్ గడాఫీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అమెరికా చేసిన సంకల్పం ఇలా ఇవన్నీ అమెరికా ఆధిపత్యానికి సవాళ్లుగా నిలిచాయి. ఆ తర్వాత ఇన్నేళ్లు అఫ్గాన్ లో అమెరికా పడిన శ్రమ రోజుల వ్యవధిలో ఇలా వ్యర్థమైంది. అమెరికా ప్రచ్ఛన్న యుద్ధంలో విజయం సాధించిందని కొందరు వాదించవచ్చు. అయితే సోవియట్ యూనియన్ పతనమైన 30 సంవత్సరాల తర్వాత ఇలా ఓ కోల్డ్ వార్ గెలవడం వల్ల కలిగే ప్రయోజనాలు పెద్దగా ఏం ఉండవు.
అమెరికాకు అవమానం..
అయితే అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడాన్ని గమనిస్తే ప్రపంచానికే సూపర్ పవర్ అయినా అమెరికాకు కూడా పరిమితులు ఉన్నాయని అర్థమవుతుంది. మితిమీరిన సైనిక శక్తిని ఎక్కడా వినియోగించకూడదని తెలుస్తోంది. ఇది కచ్చితంగా చైనాకు కూడా ఓ గుణపాఠం. అయితే అమెరికా ఎప్పుడూ తన సైనిక పరాజయాలను పూర్తిగా ఒప్పుకోలేదు. కానీ ఈ అఫ్గాన్ ఘటన తర్వాత నుంచి మాత్రం అమెరికా.. తిరుగుబాటుదారులతో ఎలా వ్యవహరించాలి, గెరిల్లాలతో ఎలా పోరాడాలి అనే విషయంపై కచ్చితంగా ఆలోచన చేస్తుంది. అల్-ఖైదా, తాలిబన్, ఐసీస్ ఇతర జిహాదీ గ్రూపులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్లలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
కొరియా, వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్థాన్ లలో యూఎస్ చేసిన యుద్ధాలకు భిన్నంగా జర్మనీపై అమెరికా విజయం గురించి చాలా తక్కువగా చెప్తారు. ఇక్కడ వారు గెలిచిన యుద్ధం పెద్దదే అయినప్పటికీ ఆ రెండు దేశాలు ఒకే సంస్కృతికి చెందినవి. రెండూ వెస్ట్రన్ కల్చర్ కు టార్ట్ బేరర్ లే. అయితే అఫ్గాన్ సహా ఆసియా దేశాలలో అమెరికా ప్రాబల్యం తగ్గడానికి ప్రధాన కారణం ఇక్కడి పాశ్చాత్య సంస్కృతి పట్ల సహజంగా ఉన్న అయిష్టత. తమ సంస్కృతిని కాలరాస్తున్నారనే ఆలోచన బలంగా వచ్చినప్పుడు ఎంతటి శక్తిమంతమైన సైనిక శక్తి అయినా వెనుదిరగక తప్పదు.
- వినయ్ లాల్, హిస్టరీ, ఆసియా అమెరికన్ స్టడీస్ ఫ్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్