Vehicle Horns: హోరెత్తే హారన్లకు బదులు సంగీత సరిగమలు - కేంద్ర మంత్రి కొత్త ప్లాన్
Nitin Gadkari on Vehicle Horns: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీ, భారతీయ సంగీత వాద్యాల శబ్దాన్ని వాహన హారన్లుగా ఉపయోగించే చట్టాన్ని తీసుకురావాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు.

Musical Accompaniment Instead Of Noisy Horns: రోడ్డెక్కితే వాహనాల వరద, రొద, సొద. కర్ణభేరికి కంతలు పడేలా, గుండె గతుక్కుమనేలా హారన్ల మోత. కొందరు పోకిరీలు వికృత శబ్ధాలను బైక్ హారన్‌గా పెట్టి జనాన్ని ఝడిపిస్తుంటారు, శునకానందం పొందుతుంటారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే, హోరెత్తే హారన్లకు మంగళం పాడి మూలన పెట్టాల్సి ఉంటుంది. వాటి స్థానంలో శ్రావ్యమైన సంగీతం వినిపించే కొత్త పరికరాలు పని చేయడం ప్రారంభిస్తాయి. కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన ప్రకారం, భారతీయ సంగీత వాద్యాల శబ్దాలను వాహనాల హారన్‌లుగా ఉపయోగించడం తప్పనిసరి చేసే చట్టాన్ని తీసుకురాబోతున్నారు. అంటే, మనం రోడ్డుపైకి వెళితే హడలెత్తించే హారన్‌కు బదులు వేణువు, తబలా, హార్మోనియం, వీణ శబ్దాలను వినసొంపుగా వినవచ్చు. అన్ని వాహనాల హారన్లు భారతీయ సంగీత వాద్యాల ధ్వనిని కలిగి ఉండాలని నితిన్ గడ్కరీ స్పష్టంగా చెప్పారు, ఇది శ్రావ్యమైన శ్రవణ అనుభవాన్ని అందించగలదు.
ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాహనాల హారన్ల గురించి మాట్లాడారు. దేశంలో తిరిగే అన్ని వాహనాల హారన్లు భారతీయ సంగీత వాద్యాల ధ్వనుల ఆధారంగా ఉండేలా చట్టం చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. తద్వారా అవి వినడానికి ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న హారన్లకు బదులుగా ఫ్లూట్, తబలా, హార్మోనియం వంటి భారతీయ సంగీత వాద్యాల శబ్దాలను మాత్రమే ఉపయోగించాలనే ప్రతిపాదన ఉన్నట్లు గడ్కరీ వెల్లడించారు. కేంద్ర మంత్రి చెప్పిన మాటలు వాస్తవ రూపంలోకి వస్తే, భారతదేశ రోడ్లపై వాహన హారన్‌లను ఉపయోగించే నియమాల్లో త్వరలో పెద్ద మార్పు రావచ్చు. మీకు కార్, బైక్ లేదా మరేదైనా వాహనం ఉంటే ఈ రూల్ మిమ్మల్ని కూడా ప్రభావితం చేయవచ్చు.
పర్యావరణ అనుకూల వాహనాలకు ప్రోత్సాహం
దేశంలోని వాయు కాలుష్యంలో 40 శాతం వాటా రవాణా రంగానిదే అని నితిన్ గడ్కరీ వెల్లడించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మిథనాల్ & ఇథనాల్ వంటి పర్యావరణ అనుకూల & జీవ ఇంధనాలతో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
కార్ల ఎగుమతి వల్ల ఎక్కువ ప్రయోజనాలు
ద్విచక్ర వాహనాలు, కార్ల ఎగుమతి ద్వారా భారతదేశానికి ఎక్కువ ఆదాయం వస్తోందని నితిన్ గడ్కరీ చెప్పారు. 2014లో భారత ఆటోమొబైల్ రంగం విలువ (Indian automobile sector Value) రూ. 14 లక్షల కోట్లుగా ఉందని, ఇప్పుడు అది రూ. 22 లక్షల కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి వివరించారు. అంటే, టూవీలర్ & ఫోర్ వీలర్ ఎగుమతులు కేవలం పదేళ్లలోనే 63 శాతం పైగా పెరిగాయి & కేంద్ర ప్రభుత్వ ఖాజానా నింపుతున్నాయి.
ప్రపంచంలో మూడో అతి పెద్ద వాహన మార్కెట్
ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో భారతదేశం సుస్థిర స్థానంలో ఉన్న విషయాన్ని గడ్కరీ ప్రస్తావించారు. భారతదేశం, ప్రస్తుతం, ప్రపంచంలో మూడో అతి పెద్ద వాహన మార్కెట్‌గా (India is the third largest automobile market in the world) అవతరించిందని, యునైటెడ్ స్టేట్స్ & చైనా తర్వాత మనమే ఉన్నామని అన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్ల ఎగుమతి ద్వారా భారతదేశం చాలా ఆదాయం సంపాదిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు.





















