Maruti Suzuki e-Vitara: మారుతి ఇ-విటారా లాంచింగ్ ఆలస్యం అవుతుందా? చైనా ఆంక్షలతో వెయిటింగ్ పీరియడ్ పెరిగే అవకాశం!
Maruti Suzuki e-Vitara Production Cut: ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ కారు లాంచ్ కాబోతోంది. లాంచ్ అయిన తర్వాత ఇ విటారా కోసం మరింత ఎక్కువ కాలం నిరీక్షించాల్సిరావచ్చు.

Maruti Suzuki e-Vitara Launching Date: మారుతి సుజుకీ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇ-విటారా కోసం మన దేశంలో కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ కారుపై చాలా అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ కారు కోసం కస్టమర్ల నిరీక్షణ కాలం (waiting period for e Vitara) ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. "రేర్ ఎర్త్ మాగ్నైట్స్" సరఫరాలో అంతరాయం దీనికి కారణం.
వాస్తవానికి, రేర్ ఎర్త్ మాగ్నైట్స్ అనేవి ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చైనా నుంచి దిగుమతి కావాలి. కానీ, అమెరికా విధించిన సుంకాలపై ఆగ్రహించిన డ్రాగన్ కంట్రీ, అన్ని దేశాలకు రేర్ ఎర్త్ మాగ్నైట్స్ ఎగమతిని నిలిపేసింది. ఆ ఎఫెక్ట్ ఇండియా మీద, ఎలక్ట్రిక్ వాహన రంగం మీద చాలా గట్టిగా పడింది. రేర్ ఎర్త్ మాగ్నైట్స్ సరఫరాలో ఇబ్బందులు కారణంగా, తన తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారా ఉత్పత్తి అంచనాను మారుతి సుజుకీ గణనీయంగా తగ్గించింది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఆటోమేకర్, ఈ ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య 26,512 యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, రేర్ ఎర్త్ మాగ్నైట్స్ సప్లై ఇబ్బందుల కారణంగా ఆ లక్ష్యానికి భారీ కోత వేసి 8,221 యూనిట్లకు తగ్గించింది. ఇది అసలు లక్ష్యంతో పోలిస్తే ఏకంగా 69 శాతం తగ్గింపు. కాబట్టి, లాంచ్ సమయంలో ఇ విటారా వెయిటింగ్ పీరియడ్ చాలా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కీలక పాయింట్లు:
1. ఎగుమతిపై చైనా ఆంక్షల కారణంగా రేర్ ఎర్త్ మాగ్నైట్స్ కొరత.
2. మారుతి ఇ విటారా FY26 ఉత్పత్తి లక్ష్యం 67,000 యూనిట్లు.
3. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, షెడ్యూల్ ప్రకారమే ఇ విటారా లాంచింగ్ ఉంటుందన్న మారుతి.
2025 అక్టోబర్ - 2026 మార్చి మధ్య రోజుకు 440 ఇ-విటారాలను ఉత్పత్తి చేయాలని మారుతి యోచిస్తోంది. అయితే, చైనా ఇటీవలి ఎగుమతి ఆంక్షల వల్ల రేర్ ఎర్త్ మాగ్నైట్స్ కొరత ఏర్పడింది. ఇది ఒక్క ఇండియానే కాదు, మొత్తం ప్రపంచ వాహన రంగాన్ని ప్రభావితం చేసింది. ఈ గండం నుంచి గట్టెక్కడానికి US, యూరప్, జపాన్‌లోని కార్ల తయారీ కంపెనీలు చైనా నుంచి ఎగుమతి లైసెన్స్‌లు పొందుతున్నారు. భారతీయ ఆటోమేకర్లు ఇప్పటికీ అలాంటి ఆమోదాల కోసం ఎదురు చూస్తున్నారు, దీనివల్ల కార్ల ఉత్పత్తిలో జాప్యం జరుగుతోంది.
ప్లాన్ B
ప్రస్తుతం ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో ఉత్పత్తిని పెంచాలని, తద్వారా పూర్తి-సంవత్సర ఉత్పత్తి లక్ష్యమైన 67,000 ఇ-విటారాలను చేరుకోవాలని మారుతి సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది. 2025 అక్టోబర్ - 2026 మార్చి మధ్య ఈ కంపెనీ 58,728 యూనిట్లను తయారు చేయాలని యోచిస్తోంది, మునుపటి లక్ష్యం 40,437. అంటే, గరిష్టంగా రోజుకు 440 వాహనాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
మారుతి e Vitara లాంచ్ టైమ్‌లైన్
మారుతీ సుజుకీ షెడ్యూల్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్‌లో e Vitara లాంచింగ్ ఉంటుంది. ఆ వెంటనే కారు ధరను వెల్లడించడం, డెలివరీల ప్రారంభించడం జరగాలి. ఇదంతా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని మారుతి వెల్లడించింది. రేర్ ఎర్త్ మాగ్నైట్‌ల ఇష్యూ e Vitara లాంచ్ టైమ్‌లైన్‌పై ఇంకా ప్రభావం చూపలేదని ఈ కంపెనీ గత వారం స్పష్టం చేసినప్పటికీ, ఈ కారు కోసం బుకింగ్స్ ప్రారంభించడంలో ఆలస్యం జరుగుతోంది.
భారతదేశంలో, EV విభాగంలో టాటా మోటార్స్ & మహీంద్రా నుంచి మారుతి సుజుకీ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. ఈ కంపెనీ మొత్తం ప్రయాణీకుల వాహన మార్కెట్ వాటా 2020 మార్చిలో 51 శాతం ఉండగా, ఇప్పుడు అది 41 శాతానికి తగ్గింది.





















