Hero Glamour X vs TVS Raider - 125cc బైకుల పోటీలో హీట్ పెరిగిందిగా!
Hero Glamour X Launch India: క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన హీరో గ్లామర్ X, ఇప్పుడు, TVS రైడర్‌కి గట్టి పోటీగా మారింది. దీంతో, 125cc బైక్ సెగ్మెంట్ పోటీలో హీటు పెరిగింది, రేసు రసవత్తరంగా మారింది.

New 125cc Bikes Comparison India: 125cc బైక్ సెగ్మెంట్ ఇప్పుడు మరింత హాట్ హాట్‌గా మారింది. హీరో మోటోకార్ప్, తాజాగా, 2025 గ్లామర్ X 125 ని (Hero Glamour X 125) లాంచ్ చేసి, TVS Raider 125 కి గట్టి సవాలే విసిరింది. "ఇండియాలో మోస్ట్ ఫ్యూచరిస్టిక్ 125cc" బైక్ అని హీరో మోటోకార్ప్ చెప్పుకుంటున్న ఈ కొత్త గ్లామర్ X ప్రత్యేక ఫీచర్లతో బైక్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, ఇది నిజంగా TVS రైడర్‌కు కఠినమైన పోటీనా?. వీటి స్పెక్స్, ఫీచర్లు, హైదరాబాద్, విజయవాడ ధరల్లో పోలికలు చూద్దాం.
ఇంజిన్ పవర్ కంపారిజన్
హీరో గ్లామర్ X - 124.7cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వచ్చింది. ఇది 11.3 hp పవర్, 10.5 Nm టార్క్ ఇస్తుంది. ఇదే ఇంజిన్‌ను Xtreme 125Rలో కూడా వాడుతున్నారు.
TVS రైడర్ - 124.8cc ఇంజిన్‌తో వచ్చింది. 11.22 hp పవర్, 11.75 Nm టార్క్ ఇస్తుంది. టార్క్ పరంగా TVS Raider కాస్త ముందంజలో ఉంది.
ఫీచర్లలో గట్టి పోటీ
హీరో గ్లామర్ X లో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఇచ్చారు. 125cc సెగ్మెంట్‌లో ఈ ఫీచర్ ఉన్న మొట్టమొదటి బైక్ ఇది. అదనంగా రైడ్-బై-వైర్ టెక్నాలజీ, మూడు రైడింగ్ మోడ్స్ (ఎకో, రోడ్, పవర్) కూడా ఉన్నాయి. రియర్ పానిక్ బ్రేక్ అలర్ట్ కూడా కొత్తగా వచ్చి చేరింది.
ఇక, TVS రైడర్‌లో వేర్వేరు వేరియంట్లలో LCD లేదా రివర్స్ LCD క్లస్టర్ ఉంది. టాప్ వేరియంట్‌లో TFT కన్సోల్ 99 ఫీచర్లతో వస్తుంది. వాయిస్ అసిస్ట్, కాల్ మేనేజ్‌మెంట్, నావిగేషన్, నోటిఫికేషన్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.
హైదరాబాద్, విజయవాడలో ఆన్-రోడ్ ధరలు
హీరో గ్లామర్ X - డ్రమ్ వేరియంట్ ధర రూ. 89,999 ఎక్స్-షోరూమ్. డిస్క్ వేరియంట్ ధర రూ. 99,999 ఎక్స్-షోరూమ్. హైదరాబాద్, విజయవాడలో ఆన్-రోడ్ ధరలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలిపి సుమారు రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.22 లక్షల వరకు (Hero Glamour X 125 on-road price, Hyderabad Vijayawada) ఉంటాయి. విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లో కూడా స్వల్ప మార్పులతో దాదాపు ఇదే ఆన్-రోడ్ ప్రైస్ ఉంటుంది.
TVS రైడర్ 125 - ఐదు వేరియంట్లలో లభిస్తోంది. ధరలు రూ. 87,375 నుంచి మొదలై రూ. 1.03 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో ఆన్-రోడ్ ధరలు వేరియంట్ ఆధారంగా రూ. 1.08 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు (TVS Raider 125 on-road price, Hyderabad Vijayawada) ఉంటాయి.
ఏ బైక్ ఎంచుకోవాలి?
ఫీచర్లు, మోడ్రన్ టెక్నాలజీ కావాలంటే - హీరో గ్లామర్ X మంచి ఆప్షన్.
ఎక్కువ టార్క్, బడ్జెట్ ధరలో మరిన్ని ఆప్షన్లు కావాలంటే - TVS రైడర్ ఉత్తమ ఎంపిక.
హైదరాబాద్, విజయవాడ లేదా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా 125cc బైక్ కొనాలనుకునే యువతకు ఈ రెండు బైక్‌లు టాప్ ఆప్షన్లు. ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో గ్లామర్ X కొత్తదనాన్ని చూపిస్తే; కనెక్టివిటీ, స్టైలిష్ డిజైన్ వల్ల రైడర్ పట్ల ప్రత్యేక క్రేజ్ ఉంది. మీరు కోరేది టెక్నాలజీనా? లేక బడ్జెట్‌లో బలమైన టార్క్ బైకా? అన్నదానిపైనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది.





















