యూత్‌కి డిస్కౌంట్ ఆఫర్ - ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్ రేటు భారీగా తగ్గింది
ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ బైక్ ధర భారీగా తగ్గింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్ రూ.79,999 నుంచే అందుబాటులో ఉంది. కొత్త ధరలు, బ్యాటరీ ఆప్షన్లు, ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Ola Roadster Electric Bike Price: భారతదేశంలో ఎలక్ట్రిక్ రెండు చక్రాల వాహనాల మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో, ఓలా, ఎలక్ట్రిక్ వెహికల్ యూజర్లను ఆకర్షించేందుకు పెద్ద నిర్ణయం తీసుకుంది. తన రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సిరీస్‌పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఇప్పుడు ఈ బైక్ రూ.79,999 (ఎక్స్-షోరూమ్ ధర) నుంచే అందుబాటులోకి వచ్చింది.
ఈ డిస్కౌంట్‌ను కంపెనీ హోలీ మహోత్సవం ఆఫర్‌లో భాగంగా ప్రకటించింది. దీంతో ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ బైక్‌లను కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం కావొచ్చు.
కొత్త ధరలు - రోడ్‌స్టర్ X మోడల్
ఓలా రోడ్‌స్టర్ X సిరీస్ ఇప్పుడు మూడు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. కంపెనీ వీటి ధరలను తాజాగా సవరించింది.
2.5kWh బ్యాటరీ వేరియంట్ - రూ.79,999 (ఎక్స్-షోరూమ్ ధర)
3.5kWh బ్యాటరీ వేరియంట్ - రూ.92,999 (ఎక్స్-షోరూమ్ ధర)
4.5kWh బ్యాటరీ వేరియంట్ - రూ.99,999 (ఎక్స్-షోరూమ్ ధర)
ఈ ధరలతో రోడ్‌స్టర్ X ఇప్పుడు సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా మారింది.
రోడ్‌స్టర్ X+ ధరలు
ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండే రోడ్‌స్టర్ X+ మోడల్‌కు కూడా కొత్త ధరలు ప్రకటించింది.
4.5kWh బ్యాటరీ వేరియంట్ - రూ.1.09 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)
9.1kWh బ్యాటరీ వేరియంట్ - రూ.1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)
ఈ మోడళ్లలో పెద్ద బ్యాటరీతో పాటు మరిన్ని ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.
హోలీ స్పెషల్ ఆఫర్లు
హోలీ పండుగ సందర్భంగా ఓలా కంపెనీ మరికొన్ని ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించింది. కొంతమంది కస్టమర్లకు 90 నిమిషాల ప్రత్యేక ఆఫర్ విండోలో మాత్రమే ప్రత్యేక ధరలు అందుబాటులో ఉంటాయి.
ఆ సమయంలో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే వారికి ప్రత్యేక తగ్గింపు ధరలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కొన్ని S1 స్కూటర్ మోడళ్లపై ఎక్స్‌టెండెడ్ వారంటీ ఆఫర్ కూడా అందిస్తోంది.
అమ్మకాలపై ప్రభావం
ఓలా ఎలక్ట్రిక్ ఈ ధర తగ్గింపును ప్రకటించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఇటీవల కంపెనీ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. 2026 ఫిబ్రవరిలో ఓలా ఎలక్ట్రిక్ కేవలం 3,968 యూనిట్లు మాత్రమే విక్రయించింది. దీంతో ఎలక్ట్రిక్ టూవీలర్ వెహికల్ మార్కెట్‌లో కంపెనీ ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఓలా మార్కెట్ షేర్ సుమారు 4 శాతం మాత్రమే ఉంది. గత సంవత్సరం జనవరిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆ సమయంలో ఓలా TVS, బజాజ్ కంపెనీలను కూడా మించి ఎక్కువ అమ్మకాలు నమోదు చేసింది.
కొనుగోలు దారులకు మంచి అవకాశం?
ఇప్పుడు ప్రకటించిన కొత్త ధరలతో ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్ మరింత మందికి అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా పెట్రోల్ బైక్‌ల నుంచి ఎలక్ట్రిక్ బైక్‌లకు మారాలని భావించే వారికి ఇది మంచి అవకాశం కావొచ్చు.
ధర తగ్గింపు, ఫెస్టివ్ ఆఫర్లు, పెద్ద బ్యాటరీ ఆప్షన్లు కలిపి చూస్తే రాబోయే నెలల్లో ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు మళ్లీ పెరిగే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు























