Hyundai Creta Vs Tata Curvv: హ్యుందాయ్ క్రెటా vs టాటా కర్వ్ - రేటు, ఫీచర్ల పరంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏ SUV బెస్ట్?
Best SUV For Middle Class Family: హ్యుందాయ్ క్రెటా & టాటా కర్వ్‌లో ఏ SUV మధ్యతరగతి కుటుంబానికి సరిపోతుంది?. ఈ రెండింటి ధర, ఫీచర్లు, భద్రత & మైలేజ్ గురించి ఈ స్టోరీలో మాట్లాడుకుందాం.

Tata Curvv Vs Hyundai Creta Price, Mileage And Features: మిడ్-సైజ్ SUV మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా - టాటా కర్వ్ మధ్య పోటీ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ రెండు కార్లను, ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ప్రీమియం ఫీచర్లు, బ్రాండ్ వాల్యూతో క్రెటా పాపులర్ అయితే - యూనక్ కూపే స్టైల్, సేఫ్టీ ఫీచర్లతో కర్వ్ ప్రజల హృదయాలు గెలుచుకుంది.
ధర & వేరియంట్ల పోలిక
హ్యుందాయ్ క్రెటా ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.11 లక్షల నుంచి ప్రారంభమై రూ. 20.50 లక్షల వరకు ఉంటుంది. టాటా కర్వ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి ప్రారంభమై ధర రూ. 19.52 లక్షల వరకు ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ బయ్యర్లకు టాటా కర్వ్ కొంచెం చౌకగా ఉంటుంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
హ్యుందాయ్ క్రెటా ఒక ప్రీమియం-ఫీల్ SUV. ఇందులో డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు (ఇన్ఫోటైన్‌మెంట్ & ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి సూపర్ ఫీచర్లు లక్షణాలు ఉన్నాయి. ఇలాంటి ఫీచర్లలో టాటా కర్వ్ కూడా తక్కువ తినలేదు. పెద్ద 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ & గెస్చర్ ఓపెనింగ్ టెయిల్‌గేట్, స్టైలిష్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో లాంచ్ అయింది. సాంకేతికత & సౌకర్యం పరంగా రెండు SUVలు ఒకదానికొకటి గట్టి పోటీగా నిలిచాయి.
ప్రయాణీకుల భద్రత
హ్యుందాయ్ క్రెటాలో ఆరు ఎయిర్‌బ్యాగులు, లెవెల్-2 ADAS 19 ఫంక్షన్స్, 360-డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ & ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. టాటా కర్వ్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS 20 ఫంక్షన్స్, హిల్ డిసెంట్ కంట్రోల్ & ISOFIX మౌంట్స్ ఉన్నాయి. టాటా కర్వ్ BNCAP నుంచి 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ పొందింది, మరింత సురక్షితంగా ఉంటుంది. టాటా బ్రాండ్ దృఢమైన నిర్మాణ నాణ్యత కారణంగా, ప్రయాణీకుల భద్రత విషయంలో కర్వ్‌ది పైచేయి అవుతుంది.
ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
హ్యుందాయ్ క్రెటా 1.5L పెట్రోల్, 1.5L డీజిల్ & 1.5L టర్బో-పెట్రోల్ (140 bhp) ఇంజిన్ ఆప్షన్స్‌తో వచ్చింది. ఇవి 6-స్పీడ్ మాన్యువల్, CVT & 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్స్‌తో యాడ్ అయ్యాయి. టాటా కర్వ్ 1.2L రెవోట్రాన్ టర్బో-పెట్రోల్, 1.2L హైపెరియన్ పెట్రోల్ & 1.5L డీజిల్ ఇంజిన్ ఎంపికలతో.. 6-స్పీడ్ మాన్యువల్ & 7-స్పీడ్ DCA ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. ఇక్కడ... డ్రైవింగ్ రిఫైన్‌మెంట్ & ట్రాన్స్‌మిషన్ స్మూత్‌నెస్ పరంగా హ్యుందాయ్ క్రెటాను కొంచెం ఎక్కువగా చూడాలి.
మైలేజీ
హ్యుందాయ్ డేటా ప్రకారం... క్రెటా పెట్రోల్ వేరియంట్ లీటరుకు 16-18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది & డీజిల్ వేరియంట్ లీటరుకు 19-21 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. టాటా మోటార్స్ డేటా ప్రకారం... కర్వ్ పెట్రోల్ వెర్షన్ లీటర్‌కు 15-17 కి.మీ. ప్రయాణిస్తుంది & డీజిల్ వెర్షన్ లీటర్‌కు 19-22 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదు. ఈ రెండు SUVలు మైలేజ్ పరంగా దాదాపు సమానంగా ఉన్నాయి.
మీరు ఈ రెండు కార్లను ప్రత్యక్షంగా చూసి, ఈ పోలికలను బట్టి మీ అవసరానికి అనుకూలమైన SUVని ఎంచుకోవచ్చు.





















