TDP: నెలకో పథకం అమలు చేసేలా సంక్షేమ క్యాలండర్ - టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం
Telugudesam: నెలకు ఓ పథకం అమలు చేసేలా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించాలని టీడీపీ నిర్ణయించింది. పొలిట్ బ్యూరో భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

TdP Politburo: ఆంధ్రప్రదేశ్ లో నెలకో సంక్షేమ పథకం అమలు చేసేలా ఏడాది క్యాలెండర్ రూపకల్పనకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం చేసింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో మీటింగ్ లో పథకాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీపం పథకం కింద ఉచితంగా ఇస్తున్న మూడు సిలిండర్లకు ఇక నమోదు, బుకంగ్ తో సంబంధం లేకుండా అర్హులందరికీ నగదు జమ చేయనున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా లేదా అన్నది పట్టించుకోరు. అలాగే మరో రెండు నెలల్లో ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తెస్తారు. ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తారు. తల్లిదండ్రుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. వచ్చే నెలలో అన్నదాత సుఖీభవను అమలు చేయాలని నిర్ణయించారు.
పార్టీ పదవుల విషయంలోనూ టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి చెందిన ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ ప్రతిపాదనకు తెలుగుదేశం పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఆరు ఏళ్లుగా ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు. మండల పార్టీ అధ్యక్షులుగా చేసిన వారికి ఆ పైస్థాయి పదవి లేదా ఇతర సమాంతర పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహణపై పొలిట్ బ్యూరో చర్చింది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఈ నెల 27న చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన వారికి సంఘీభావం గా 16, 17, 18 తేదీల్లో తిరంగా ర్యాలీలు నిర్వహిoచాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది.తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి అన్ని నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ సభ్యత్వం ఉండి చనిపోయిన వారి కుటుంబాలకు భీమా త్వరగా అందేలా చర్యలకు నిర్ణయం చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహించడమైనది. మహానాడు నిర్వహణే ప్రధాన అజెండాగా జరిగిన ఈ సమావేశంలో.. పహల్గాం దాడి అమరులకు టీడీపీ పొలిట్ బ్యూరో నివాళులు… pic.twitter.com/8cz2t2XScx
— Kondapalli Srinivas (@SKondapalliOffl) May 14, 2025
మహానాడు లోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయించారు. మహానాడుకు తక్కువ సమయమే ఉన్నా ఎవరికీ ఏ లోటూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కడప గడ్డపై యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ అమలుకు మహానాడు నాంది పలకుతుందని భావిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోదీ, త్రివిధ దళాలకు పొలిట్ బ్యూరో అభినందిస్తూ తీర్మానం చేసింది. పద్మభూషణ్ అందుకున్న పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణకు పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది.





















