Srisailam Temple : శ్రీశైలంలో రూ. 100లకే ప్రత్యేక దర్శనం- శివుడి ఆలయంలో బ్యాక్‌డోర్ దందా!
Srisailam Temple : 150 రూపాయలు ఇస్తే శ్రీశైలంలో త్వరగా దర్శనం అవుతుంది. కానీ 100 రూపాయలు ఇస్తే అదే దర్శనం సిబ్బంది చేయిస్తున్నారు. ఈ దందాతో దేవస్థాన ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.
Srisailam Temple : పరమ పవిత్రమైన దేవాలయాల్లో కూడా అక్రమార్కుల రాజ్యమేలుతోంది. ఎంతో భక్తి భావంతో వెళ్తున్న భక్తులను నిలువునా మోసం చేస్తున్నారు. తెలుసో తెలియకో చేసిన తప్పులు మన్నించాలని కోరుతూ దైవదర్శనం చేసుకుంటాం. అలాంటి పవిత్రమైన స్థలంలో పని చేసే సిబ్బంది పైసాలకు కక్కుర్తిపడి దందాలు చేయడం చూస్తుంటే భక్తులు రక్తం మరిగిపోతోంది. సరి చేయాల్సిన ఉన్నతాధికారులు, ప్రభుత్వాలు, పాలకమండల సిబ్బంది చూసీచూడనట్టు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి.
శ్రీశైలం హిందువులకు పరమ పవిత్ర ఆలయం. లక్షల మంది భక్తులు ఏటా వస్తుంటారు. అలాంటి చోట కేటుగాళ్లు చాలా మంది భక్తులను నిలువునా మోసం చేస్తున్నారు. భక్తులను మోసం చేయడమే కాకుండా ఆలయానికి రావాల్సిన డబ్బులను కూడా తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఇదంటని అడిగే వారు లేకపోవడం, అక్కడి సిబ్బంది ఒకరినొకరు సహకరించుకోవడంతో వారి కలెక్షన్ శ్రీశైలం ఆదాయం కంటే మిన్నగా ఉంటోంది.
Also Read: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
శ్రీశైలంలో దేవుని దర్శనానికి మూడు దారులు ఉన్నాయి. ఉచిత దర్శనం, 150 రూపాయల దర్శనం, 300 రూపాయల టికెట్ తీసుకొని చేసే దర్శనం. ఈ దర్శనాల వద్ద శ్రీశైలంలో పని చేసే సిబ్బంది దందాకు తెగబడుతున్నారు. ఉచిత దర్శనానికి వెళ్తున్న వారిని కంపార్ట్‌మెంట్‌లలోకి పంపిస్తారు. అక్కడే పెద్ద బోర్డు ఉంటుంది. ఎన్ని గంటలకు దర్శనం కల్పిస్తారో అక్కడ పెద్ద అక్షరాలతో టైం రాసి పెడతారు.
ఉచిత దర్శనానికి వెళ్తున్న భక్తులు మొదట టైం చూస్తారు. తర్వాత కంపార్ట్‌మెంట్‌లో భక్తులను చూస్తారు. అక్కడే తిరుగుతున్న సిబ్బందిని అడిగితే దర్శనానికి చాలా టైం పడుతుందని చెబుతారు. అక్కడి కొంత దూరంలో ఓ డోర్ ఉంటుంది. అక్కడ మరికొందరు సిబ్బంది ఉంటారు. ఇలా ఉచిత దర్శనానికి వెళ్లాలా లేకుంటే మిగతా రెండు దర్శనాలకు వెళ్లాలా అనే ఆలోచనలో ఉన్న వారితో మాట్లాడతారు.
మాటలు కలిపిన తర్వాత ఎంత ఇస్తారో చెప్పండి అందరి కంటే ముందే దర్శన భాగ్యం కల్పిస్తామని అసలు విషయం చెబుతారు. వాళ్లకు ఒకరికి వంద ఇస్తే ఒక దర్శనం, రెండు వదలు ఇస్తే ఇంకో దర్శనం ఉంటుంది. ఎలా పంపిస్తారు అని అడిగితే వాళ్లు ఓ దారి చూపిస్తారు అందులో నుంచి పంపిస్తామని వివరిస్తారు. దర్శన టైం అయిపోతుందని ఏ విషయమైన త్వరగా చెప్పాలని అంటారు.
డబ్బులు ఇచ్చిన తర్వాత కంపార్ట్‌మెంట్ కంటే ముందు ఉన్న ఓ గదిలో చిన్న గేట్ ఉంటుంది. ఆ గేట్ ఓపెన్ చేస్తే రెండు కంపార్ట్‌మెంట్‌ల మధ్య నుంచి దారి ఉంటుంది. ఇలా బ్యాక్‌డోర్ దర్శనాలకు డబ్బులు ఇచ్చిన వారిని ఆ దారి గుండా దర్శనానికి పంపిస్తారు.
ఇలా రోజూ వందల మందిని ఇలా దర్శనాలకు పంపిస్తున్నారు ఇక్కడి సిబ్బంది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత దర్శనాల కోసం వచ్చిన వారి నుంచి వంద నుంచి 150 రూపాయలు తీసుకొని దొంగచాటు దర్శనాలు చేయించడంపై మండిపడుతున్నారు. ఇందులో ఆలయంలో పని చేసే సిబ్బందితోపాటు పోలీసులు అంతా కుమ్మక్కై దందా సాగిస్తున్నారు. ఇలాంటి వారిని ఎప్పుడు పంపించాలో కూడా ఓ వ్యక్తి ఫోన్ చేసి చప్తాడు. విడిచి పెట్టాలా వద్దా అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకన్న తర్వాత ఇక్కడ గేటు తాళం తీస్తారు.
Also Read: మొక్కులు చెల్లించుకునేందుకు మహిళ సాహసం, 2 కిలోల నువ్వుల నూనె తాగాక!