Viral News: మొక్కులు చెల్లించుకునేందుకు మహిళ సాహసం, 2 కిలోల నువ్వుల నూనె తాగాక!
Adilabad Tradition | తోడసం వంశానికి చెందిన మహిళ రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఖాందేవ్ జాతర సందర్భంగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
Khamdev Jatara in Adilabad district | ప్రకృతిని పూజించే ఆదివాసీలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అదిక ప్రాధాన్యం ఇస్తారు. పుష్యమాసం సంధర్భంగా తమ ఆది దైవాలను నియమ నిష్ఠలతో ఉంటూ భక్తి శ్రద్ధలతో కొలుస్తు మొక్కులు తీర్చుకుంటారు. ఇందులో భాగంగానే ఓ మహిళ రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లించుకుంది. అదేంటి నూనే తాగి మొక్కు చెల్లించడమెంటని అనుకుంటన్నారా..! అవును నిజమే.. మరి ఆ ఆచారం ఎక్కడ, అందుకు కారణాలు.. పూర్తి వివరాలు చదవండి.
పుష్య పౌర్ణమి సందర్భంగా పూజలు
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ఖాందేవ్ జాతర ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి సందర్భంగా తోడసం వంశస్థులు పూజలు చేసి డోలు వాయిద్యాల మధ్య పూజలు ప్రారంభించారు. ఈ పూజల్లో తొడసం వంశానికి చెందిన ఓ ఆడపడుచు మూడేళ్లపాటు ఒకరు రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకోసం తొడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛమైన నువ్వుల నూనెను సేకరిస్తారు. దేవుని సన్నిధిలో ఉంచి ఆపై తోడసం వంశం ఆడపడుచు.. ఆ నువ్వుల నూనెను తాగి తమ మొక్కును చెల్లిస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రపంచశాంతి నెలకొంటుందని, అన్ని విధాలుగా బాగుంటుందని, కుటుంబంలోను అందరికీ మంచి జరుగుతుందని తొడసం వంశస్థులు నమ్మకం.
తోడసం వంశీయుల ఆచారం
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని తోడసం వంశీయులు తమ అరాద్య దైవమైన ఖాందేవ్ ను సంప్రదాయ బద్దంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రతియేటా పుష్యమాస పౌర్ణమి రోజున తోడసం వంశ ఆడపడుచు నువ్వుల నూనే తాగి మొక్కు చెల్లించడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. పూర్వం పెద్దల కాలం నుండి ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మూడేళ్లపాటు ఓ వంశ ఆడపడుచు నువ్వుల నూనె తాగి ముక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది.
మూడోసారి 2 కిలోల నూనె తాగిన మహిళ
ఈ ఏడాది మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జీవితి మండలానికి చెందిన మేస్రం నాగుబాయి మూడవసారి రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కొవ్వలక్ష్మి మరియు మహారాష్ట్ర ఎమ్మెల్యే తొడసం రాజు ఖాందేవ్ దేవతకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. తొడసం వంశస్తుల ఆరాధ్య దైవమైన ఖాందేవునికి ఏటా పుష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిదర్శించుకున్నారు.
దేవునికి నైవేద్యం పెట్టేందుకు నెలరోజుల ముందే ఆదివాసీలు ఇంట్లో గానుగలతో నువ్వుల నూనెను తయారు చేస్తారు. అలాతయారు చేసిన నువ్వుల నూనెను దేవునికి నైవేద్యంగా సమర్పించేందుకు తీసుకువస్తారు. అలా ప్రతీ ఇంటినుంచి తీసుకువచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తరువాత వారం రోజుల పాటు ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరకు తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా మహారాష్ట్ర నుంచి సైతం తోడసం వంశీయులు ఇతరులు తరలివస్తారు. నేటి నుంచి ఇక వారం రోజుల పాటు జాతర సందడి వాతావరణం కొనసాగనుంది.
Also Read: Nagoba Jatara: నాగోబా కోసం మెస్రం వంశీయుల గంగాజల పాదయాత్ర, ఏరోజు ఏం చేస్తారు పూర్తి వివరాలిలా