MLA Gorantla : చంద్రబాబుతో బుచ్చయ్య చౌదరి భేటీ... ఇక సమస్య పరిష్కారమైనట్లే..!?
పార్టీలో గౌరవం దక్కడం లేదని రాజీనామా చేస్తానని ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చివరికి చల్లబడ్డారు. చంద్రబాబుతో సమావేశం అయ్యారు.
రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఇటీవల పార్టీలో తనకు గౌరవం లభించడం లేదని ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడం కలకలం రేపింది. తన ఫోన్ కాల్స్‌ను కూడా చంద్రబాబు, లోకేష్ రిసీవ్ చేసుకోవడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్టీ నేతలు ఆయనను బుజ్జగించారు. అయితే చంద్రబాబుతో భేటీకి మాత్రం వెళ్లబోనని ఆయన భీష్మించుకు కూర్చున్నారు. చివరికి పార్టీ నేతలు ఒప్పించి ఆయనను చంద్రబాబు వద్దకు తీసుకు వచ్చారు.
Also Read : వైఎస్ కుటుంబంలో షర్మిల ఒంటరి అయ్యారా ?
చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఇతర నేతలు చినరాజప్ప, నల్లమల్లి రామకృష్ణారెడ్డి, గద్దె రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. ఈ ముగ్గురితో కలిపి ఓ కమిటీని సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు నియమించారు. పార్టీలో ఉన్న పరిస్థితులు.. తనకు జరిగిన అవమానాలు అన్నింటిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబుకు వివరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నియమించిన త్రిసభ్య కమిటీ ఆదిరెడ్డి వర్గంతోనూ చర్చలు జరిపింది. రెండు వర్గాల మధ్య ఉన్న ప్రధానమైన సమస్యలేమిటో తెలుసుకుంది. ఇతర నియోజకవర్గాల్లో వేరే వారు వేలు పెట్టకుండా చూడాలనే అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు పార్టీ అధినేతకు కూడా నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Also Read : ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష
గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత. పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. ఇటీవలి ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవాని మామ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలో మరో కీలక నేతగా ఉన్నారు. ఆయన వర్గంతో గోరంట్లకు సరిపడటం లేదు. తన నియోజకవర్గంలో పార్టీ పదవులు తాను చెప్పిన వారికి కాకుండా ఇతరులకు ఇచ్చారని గోరంట్ల అసంతృప్తితో ఉన్నారు. తన వర్గీయుల్ని ఆదిరెడ్డి అప్పారావు వర్గం ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. చివరికి తనను కలవడానికి కూడా అడ్డంకులు కల్పిస్తున్నారని ఆయన ఆవేదన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : హరీష్ రావు చరిత్ర బయటపెడతానంటున్న ఈటల
ప్రస్తుతానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చల్లబడ్డారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన ఇక రాజీనామా గురించి ఆలోచించరని.. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారని భావిస్తున్నారు. గోరంట్ల సీనియార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన గౌరవానికి భంగం కలగకూడదని తూర్పుగోదావరి జిల్లా నేతలకు టీడీపీ హైకమాండ్ నుంచి స్పష్టమైన సందేశం వెళ్లే అవకాశం ఉందంటున్నారు.