Kuppam Babu : జగన్‌ది దోపిడీ సర్కార్ - రెండున్నరేళ్ల కంటే ముందే టీడీపీ ప్రభుత్వం ! కుప్పంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు !
ఏపీలో ముందుగానే ఎన్నికలు వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. కుప్పం పర్యటనలో ఆయన జగన్ సర్కార్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పర్యటనలో రెండు నాటు బాంబుల దాడికి ప్రయత్నం జరగడం కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదని దోపిడి ప్రభుత్వమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చాలా రోజుల తర్వాత కుప్పంలో రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించి బహిరంగసభలో మాట్లాడారు. జగన్ విధానాల వల్ల ఏపీలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని చంద్రబాబు విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర ఉండటం లేదన్నారు. ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతోందని సామాన్య ప్రజలకు కూడా రక్షణ లేదని మండిపడ్డారు.
ఏపీలో ఉన్న ప్రజా ప్రభుత్వం కాదు దోపిడి ప్రభుత్వం !
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను రాష్ట్రపతికి వివరించానని.. ఏపీని పరిపాలించే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చంద్రబాబు తేల్చారు. పోలీసు వ్యవస్థ సహకారంతో టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారని అయినా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదన్నారు. స్వయంగా డీజీపీనే దగ్గరుండి దాడి చేయించారని ఆరోపించారు. తాను ఎప్పుడూ బూతులు మాట్లాడలేదని.. ఈ అంశంపై చర్చకు రావాలని సవాల్ చేశారు. జగన్ ప్రభుత్వంపై ధర్మపోరాటం చేస్తున్నాన్నారు. తనపై బాంబులేస్తానని ఓ నేత చెప్పాడని.. తనపై 24 క్లైమోర్ మైన్స్‌తో దాడి చేశారని అయినా తనను ఏమీ చేయలేకపోయారని గుర్తు చేశారు. కుప్పంలో ప్రతిపక్ష నేత వస్తూంటే ఒక్క పోలీసు కనిపించలేదని అదే చోటామోటా వైసీపీ నేతలు వస్తే పెద్ద ఎత్తున రక్షణ కల్పిస్తున్నారని అన్నారు. కుప్పం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని.. ఎన్నో సంవత్సరాలుగా ఆదరిస్తున్నారని.. వాళ్లే తనను కాపాడుకుంటారని చంద్రబాబు ప్రకటించారు.
పన్నులు పెంచి - ధరలు బాది ప్రజల్ని గుల్ల చేస్తున్న జగన్ !
పేద ప్రజలే దేవుళ్ళు-సమాజమే దేవాలయంగా ముందుకు సాగిన పార్టీ తెలుగుదేశమని.. పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రతీ చోటా దోపిడీనే సాగుతోందని తాజాగా ఎయిడెడ్ స్కూళ్ల ఆస్తులపై కన్నేశారన్నారు. వేల కోట్ల విలువైన స్కూళ్ల ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ గంజాయికి కేరాఫ్‌గా మారిందని.. వివిధ రాష్ట్రాలకు యధేచ్చగా గంజాయి రవాణా సాగుతోందన్నారు. ఏపీ నుంచి డ్రగ్స్‌ను తరిమికొట్టి యువతను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేని జగన్ కొత్త మద్యం బ్రాండ్లను తెస్తున్నాడని మండిపడ్డారు. మద్యపాన నిషేధానికి కొత్త అర్థం తెచ్చి..ప్రజ ఆరోగ్యాలతో ఆడుకునే మద్యాన్ని అమ్ముతున్నారని విమర్శించారు. ఇప్పటికే మద్యం ఆదాయాన్ని తకట్టు పెట్టి అప్పులు తెచ్చారని మరో పాతికేళ్ల వరకూ మద్య నిషేధం విధించే అవకాశం లేదన్నారు.
ఆదాయం సృష్టించలేక అక్రమమార్గాల్లో పయనం !
ఓ వైప పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ మరో వైపు పన్నులు బాదుతూ ప్రజల్ని దోచుకుటున్నారని చంద్రబాబు ఆరోపించారు. కరెంట్ చార్జీల దగ్గర్నుంచి ప్రతీ దానిపై పన్నులేశారని గుర్తు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని.. ఆదాయం కోసం అక్రమమార్గాలు తొక్కుతున్నారని మండిపడ్డారు. సంపద సృష్టించలేక ఆస్తులు అమ్ముతున్నారని.. ఉన్న సంపదనను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహించారు. రూ. వేల కోట్ల విలువైన అమరావతిలో విధ్వంసం చేస్తున్నారన్నారు. అమరావతి రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి !
రెండున్నరేళ్ల కంటే ముందే ఎన్నికలు !
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీదే గెలుపని.. రెండున్నరేళ్ల కంటే ముందే ఎన్నికలు వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గెలిచేందుకు డబ్బు సంచులతో సిద్ధంగా ఉన్నారని.. అయితే వారిని గెలిపిస్తే ప్రతి ఇంటిలోనూ పడి దోపిడి చేస్తారని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పంలో రౌడీలు, గూండాలు అడుగుపెట్టారన్నారు. దోపిడీ, దౌర్జన్య పాలన మనకొద్దని.. కుప్పం ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ సాక్షిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్బందులకు గురిచేసిన వారెవరినీ వదిలిపెట్టబోమని ప్రకటించారు. అక్రమ కేసులకు భయపడే ప్రశ్నే లేదన్నారు.
నాటు బాంబుల దాడి కలకలం!
చంద్రబాబు పర్యటనకు అడుగడుగునా ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు ర్యాలీని మొదట పోలీసులు అడ్డుకోవాలని ప్రయత్నించారు. తర్వాత చంద్రబాబు బస చేసే గెస్ట్ హౌస్ వద్ద కరెంట్ తీసేశారు. ఫ్లెక్సీలను చించేశారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు .. టీడీపీ వర్గీయులతో ఘర్షణకు దిగారు. తర్వాత సభలో కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు. బాంబులు విసిరిన ఇద్దరు వ్యక్తులను టీడీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. సభలో సిఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.
Also Read : నిన్న నాగార్జున.. ఇవాళ దిల్ రాజు బృందం ! ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ చర్చలే చర్చలు !