Amaravati Farmers : అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి !
అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర చేస్తే ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్‌తో రైతులు పాదయాత్ర చేయాలనుకున్నారు. పాదయాత్రలో అమరావతి వల్ల 13 జిల్లాలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని నిర్ణయించారు. ఈ పాదయాత్రకు " న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు " అని పేరు పెట్టారు. అయితే ఈ పాదయాత్రకు డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి నిరాకరించారు. ఈ నిర్ణయంపై హైకోర్టులో రైతులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది.
Also Read : పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోండి... జడ్జీలపై అనుచిత పోస్టుల కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
పాదయాత్రకు అనుమతి ఇవ్వవొద్దని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని అన్నారు. అయితే రైతుల తరపు న్యాయవాది మాత్రం.. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని వివరించారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని ప్రభుత్వం తరపున న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు.. పాదయాత్రకు షరతులతో అనుమతి ఇచ్చింది.
Also Read : హస్తినలో ఏపీ రాజకీయం... టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి వైసీపీ ఫిర్యాదు
"న్యాయస్థానం నుంచి దేవస్థానం" పేరిట అమరావతి నుంచి తిరుమల వరకు మహాపాదయాత్రకు అమరావతి రైతులు, మహిళలు, కూలీలు సిద్ధమయ్యారు. అమరావతి జేఏసీ నేతృత్వంలో సాగే ఈ పాదయాత్రకు విరాళాలతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించి డిసెంబర్ 17వ తేదీన ముగియనుంది. ఏపీ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ ఆ ప్రాంత రైతులు దాదాపుగా రెండేళ్లుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అమరావతి రాజధానిగా ఉండడం వల్ల 13 జిల్లాలకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు పాదయాత్రలో వివరిస్తామని రైతులు అంటున్నారు.
Also Read: జూన్ నుంచి అమ్మఒడి.. అదానీకి విశాఖలో 130 ఎకరాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు !
మహా పాదయాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. నాలుగు రోజుల క్రితం అమరావతి రైతుల మహాపాదయాత్రకు పవన్ కళ్యాణ్ మద్దతును ప్రకటించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా గురువారం రైతులను పరామర్శించి మద్దతు తెలిపారు. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో ఇక పాదయాత్ర చేయడానికి మార్గం సుగమం అయింది.
Also Read: పోలీసులు పట్టాభిని కొట్టారన్న రఘురామ .. ఆధారాలడిగితే ఇస్తానన్న ఎంపీ !