CM Chandrababu: తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభం- తీసుకున్న సంకల్పం అదే, సీఎంగా తొలి ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Andhrapradesh News: రాష్ట్రంలో సంపద సృష్టించడమే కాకుండా దాన్ని పేదలకు అందించడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం హోదాలో తొలిసారిగా ఆయన కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
CM Chandrababu Emotional Speech: దేశంలోనే ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. గురువారం ఉదయం ఆయన సీఎం హోదాలో తొలిసారిగా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించి మంచి తీర్పు ఇచ్చారని చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామి తన కులదైవమని.. ఆయన ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతోనే విజయం సాధించామని అన్నారు. 'నేను ఏ సంకల్పం తీసుకున్నా ముందు శ్రీవారిని దర్శించుకుంటాను. ప్రతిరోజూ ఉదయం నిండు మనస్సుతో ఒక్క నిమిషం ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తాను. రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైంది. గతంలో అలిపిరి వద్ద నాపై క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామే నన్ను రక్షించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలిగి పేదరికం లేని రాష్ట్రంగా మారాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ స్వామిని వేడుకున్నా. ఇప్పుడు సంపద సృష్టించడమే కాదు పేదలకు అందించడమే నా ప్రధాన లక్ష్యం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
'తిరుమల నుంచే ప్రక్షాళన'
రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెడతానని సీఎం చంద్రబాబు అన్నారు. 'గత ఐదేళ్లలో తిరుమలలో చెయ్యని అరాచకం లేదు. తిరుమలను ధనార్జన కేంద్రంగా మార్చారు. విపరీతమైన రేట్లు, బ్లాక్ మార్కెట్‌లో టికెట్ల విక్రయించే పరిస్థితి ఉండేది. గంజాయి, అన్యమత ప్రచారం, మద్యం, మాంసం అంటూ విచ్చలవిడిగా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇష్టానుసారంగా తమకు నచ్చిన వారికి పదవులు ఇచ్చారు. ఎర్ర చందనం స్మగ్లర్లలు సీట్లు ఇచ్చారు. దృఢ సంకల్పంతో చెడును అణచి వేస్తా. తిరుమల కొండపై అపచారం చేసిన వాళ్లు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. మంచిని ప్రోత్సహిస్తా.. రౌడీయిజాన్ని అణచివేస్తా. మన రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించే విదంగా ముందుకు వెళ్తాం. పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తా. నా పర్యటనలోనూ పరదాలు కడుతున్నారు. వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించాను. గత వైసీపీ హయాంలో టీటీడీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. హైదరాబాద్ ని 1.0 విజన్ తో అభివృద్ధి చేశా. అప్పుడు చేసిన అభివృద్ధిని చూసి ప్రపంచంలోని దేశధినేతలు హైదరాబాద్‌కు వచ్చారు. శ్రీవారి సమక్షంలో చెబుతున్నా.. నేను 5 కోట్ల ప్రజల మనిషిని. ఇకపై పరదాలు, నియంత్రణ ఉండదు. నేటి నుంచి ప్రజా పాలన ప్రారంభమైంది.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
'2047 విజన్‌తో'
గత 5 ఏళ్లలో జరిగిన నష్టం అపారమని.. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని సీఎం చంద్రబాబు అన్నారు. '2047kf భారత్ ప్రపంచంలోకే మొదటి రెండు స్థానాల్లోకి వస్తుంది. 2047 విజన్‌తో ముందుకు వెళ్తాం. ఏపీ దేశంలోకే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ అభివృద్ధి చెందాలి. హైదరాబాద్ అభివృద్ధి చేసిన అనంతరం ప్రపంచ దిగ్గజాలు హైదరాబాద్‌కు వచ్చాయి. దురదృష్టం వల్ల అమరావతి, పోలవరం పడకేసింది. ఈ రెండింటిని అభివృద్ధి చెయ్యాలి. సంపద సృష్టించి.. వచ్చిన సంపద పేదవాడికి ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి. వాస్తవాలను చెప్పలేని దుస్థితిని మీడియా ఎదుర్కొంది. ప్రజలు ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Also Read: CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు 'ఆన్ డ్యూటీ' - తొలి సంతకాలు ఆ ఫైళ్లపైనే!