CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు 'ఆన్ డ్యూటీ' - తొలి సంతకాలు ఆ ఫైళ్లపైనే!
Andhrapradesh News: ఏపీ సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం 4:41 గంటలకు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. తొలిరోజు ఆయన 5 ఫైళ్లపై సంతకాలు చేయనుండగా అధికారులు దస్త్రాలు సిద్ధం చేశారు.
CM Chandrababu Will Take Charge: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) గురువారం సాయంత్రం 4:41 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం ఛాంబర్‌లో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సచివాలయాన్ని అధికారులు సుందరంగా అలంకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన 5 పైళ్లపై సంతకాలు చేయనున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేస్తారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. అలాగే, స్కిల్ సెన్సస్ ప్రక్రియ (నైపుణ్య గణన), అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేస్తారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు దస్త్రాలు సిద్ధం చేశారు. డీఎస్సీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి దాదాపు 13 వేలకు పైగా ఖాళీలున్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
మంత్రుల శాఖలపై..
అటు, మంత్రులకు కేటాయించే శాఖలపైనా గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు తిరుమల పర్యటన తర్వాత అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు అనేది ప్రకటించనున్నారు. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు.. అమాత్యులకు ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి కేటాయిస్తారనే ప్రచారం సాగుతుండగా.. ఆయనకు ఎక్కువ ప్రజలతో మమేకమయ్యేలా ఉండే శాఖను కేటాయిస్తారని సమాచారం. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ పర్యావరణ శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. పవన్ కోరిక మేరకే ఈ శాఖను కేటాయించినట్లు సమాచారం. అటు, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారని తెలుస్తోంది. అటు, నారా లోకేశ్‌కు కూడా కీలక శాఖను కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఆయన ఐటీ మినిస్టర్‌గా పని చేశారు.
అమాత్యులకు కీలక సూచనలు
మంత్రులు శాఖల వారీగా ఓ అవగాహనకు వచ్చి శ్వేత పత్రం విడుదలకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) సూచించినట్లు తెలుస్తోంది. బాధ్యతల నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. రోజువారీ కార్యకలాపాల్లో అమాత్యులకు సహకరించేందుకు ఎంబీఏ అర్హత కలిగిన వారిని నియమిస్తామని తెలిపారు. 'శాఖల్లో ఫైళ్లను ఏ విధంగా నిర్వహించాలి.? ఏం చేయాలి.?' వంటి అంశాలపై శిక్షణ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదని.. ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సంతకాలు చేయాలని సూచించారు. పీఎస్‌ల నియమించుకోవడం విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్దేశించారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మంత్రులతో కీలక భేటీ నిర్వహించిన ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని స్పష్టం చేశారు.
Also Read: CM Chandrababu: తిరుమలకు చేరుకున్న చంద్రబాబు - ప్రోటోకాల్ పాటించని అధికారులు