Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ అదుపులో శివశంకర్ రెడ్డి
వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అనుమానితుడు శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
వివేకా హత్యకేసులో అనుమానితుడు శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీబీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి.. హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి తరలించినట్టు తెలుస్తోంది.
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి శివశంకర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. దస్తగిరి విచారణ తర్వాత శివశంకర్‌రెడ్డి పేరు ఎక్కువగా బయటకు వచ్చింది. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల్లో శివశంకర్‌రెడ్డి పేరు కూడా ఉంది. ఇప్పటికే కడప, పులివెందులలో శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు.
వివేకా వద్ద డ్రైవర్ గా పని చేసిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో రాజకీయంగా కలకలం రేపింది. హత్య ఎవరు చేసారు .. ఏం జరిగింది...అసలు నిందితులు ఏం చెప్పారనే అంశం గురించి దస్తగిరి పూర్తి వివరాలు చెప్పినట్లుగా సీబీఐ కోర్టులో స్టేట్ మెంట్ తో తెలిసింది. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు దస్తగిరి చెప్పినట్లు సీబీఐ స్టేట్‌మెంట్‌లో రికార్డు చేసినట్టు తెలుస్తోంది.
ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి చెప్పాడు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు చెప్పిన దస్తగిరి దీనికి మొత్తం మూలం బెంగళూరులోని భూవివాదమే కారణం అని తెలుస్తోంది.
మరోవైపు అవినాశ్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. హత్య చేశానని చెబుతున్న దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు. అనారోగ్య కారణంగా శివశంకర్ రెడ్డి రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హాస్పటల్‌లో ఆయనను సీబీఐ బృందం అదుపులోకి తీసుకుంది. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Siricilla: ఈతకు వెళ్లి నీట మునిగిన ఆరుగురు విద్యార్థులు.. ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యం
Also Read: Wife Stabs Husband: తన బంధువుల పెళ్లికి రానన్నాడని భర్తను కత్తితో పొడిచిన భార్య, చివరికి..