Hyderabad Crime: అమ్మానాన్నలు చేసేది పాడుపనులు.. కుమార్తెకు సైతం ట్రైనింగ్.. చివరికి అడ్డంగా దొరికిపోయి!
ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలని కలలకు కంటారు. కానీ తాజాగా జరిగిన సంఘటన వివరాలు చదివితే ఆశ్చర్యపోతారు. వివరాలు ఆరా తీసి పోలీసులు సైతం షాకయ్యారు.
సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలు పోలీసులను, అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలని కలలకు కంటారు. లేకపోతే వారు చేసే వ్యాపారంలో రాణించేలా చేసి కెరీర్ ఇవ్వాలని.. తాము పడ్డ కష్టాలు పిల్లలకు తెలియకుండా జాగ్రత్త పడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ఈ భార్యాభర్తలు కాస్త భిన్నంగా ఉన్నారు. తాము చేసేదే తప్పుడు పనులు, అంతటితో ఆగకుండా కుమార్తెకు సైతం అందులో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ క్రైమ్ స్టోరీ వివరాలిలా ఉన్నాయి..
సౌత్ జోన్ డీసీపీ డాక్టర్ గజారావు భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి మొగల్‌కాలనీకి చెందిన అబ్దుల్ సలీమ్ పాత దుస్తులు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఇతడి భార్య జకియా బేగం(43). ఆమె గృహిణిగా ఇంటి పనులు చూసుకుంటుంది. వీరికి 19 ఏళ్ల కూతురు అయేషా సిద్ధిఖీ ఉంది. ఈమె సైతం ఇంటి వద్దే ఉంటోంది. కష్టపడకుండా, తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలని దంపతులు భావించారు. గత కొంతకాలం నుంచి వీరు చిన్నాచితకా చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. పలుమార్లు జైలుకెళ్లొచ్చినా తీరు మారకపోగా కుమార్తెను సైతం ఇందులోకి లాగారు.
Also Read: ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య... పురుగుల మందు తాగి ప్రయాణం... సిబ్బంది స్పందించినా నిలవని ప్రాణాలు
ఖరీదైన వస్తువులు కొనుక్కోవచ్చునని, విలాసవంతమైన జీవితం గడపాలంటే చోరీలు చేయక తప్పదంటూ కూతురు అయేషా సిద్ధిఖీకి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. ఇందుకోసం అయేషాకు పేరెంట్స్ చోరీలలో శిక్షణ కూడా ఇచ్చారు. కూతురు జత కావడంతో ముగ్గురు కలిసి 2019 నుంచి చోరీలకు పాల్పడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చక్కగా రెడీ అవుతారు. ఆపై ఏ ఇంట్లో చోరీలు చేయాలా అని కూతురు రెక్కీ నిర్వహిస్తుండగా.. తండ్రి అక్కడ కాపలా ఉంటాడు. జకియా బేగం ఇంట్లోకి దూరిపోయి ఖరీదైన వస్తువులను నిమిషాల్లో మాయం చేస్తుంది. ఎవరైనా ప్రశ్నలు వేస్తే అద్దె ఇంటికోసం తిరుగుతున్నామని చెబుతారు. ఫ్యామిలీ కావడంతో ఎవరికీ అనుమానం రాదు.
Also Read: తన బంధువుల పెళ్లికి రానన్నాడని భర్తను కత్తితో పొడిచిన భార్య, చివరికి..
ఎత్తుకెళ్లిన వస్తువులు, బంగారం నగలను తనఖా పెడతారు. అవసరమైనప్పుడు విక్రయించి సొమ్ము చేసుకుని చోరీలను కొనసాగిస్తున్నారు. విమానాలలో ప్రయాణాలు చేస్తూ డబ్బులు ఖర్చు చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. కొన్ని రోజుల కిందట గుల్షన్‌నగర్, ఘాజిబండ, చందూలాల్ బారాదరిలలో వరుస చోరీలు చోరీలు జరిగాయి. దీనిపై కామాటిపుర పోలీసులు కేసులు నమోదుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించగా ఈ ముగ్గురు చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 16.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ రాంబాబు, డీఐ శ్రీనివాస్, డీఎస్‌ఐ జి.ఎస్.డానియేల్, కానిస్టేబుళ్లు అబ్దుల్ జలీల్, కె.నవీన్‌ను సౌత్ జోన్ డీసీపీ అభినందించారు.