Lover's Suicide: ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య... పురుగుల మందు తాగి ప్రయాణం... సిబ్బంది స్పందించినా నిలవని ప్రాణాలు
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెంలో విషాద ఘటనచోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ అపస్మారకస్థితిలో చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో విషాద ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సులో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వారావుపేట బస్టాండ్‌లో పాల్వంచ వెళ్లే బస్సు ఎక్కారు. బస్సులో మైనర్ బాలిక, యువకుడు అపస్మారక స్థితిలోకి పడిఉండటాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్ గుర్తించారు. బస్సు సిబ్బంది వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ మృతిచెందారు. మృతులు చండ్రుగొండ మండలం సీతాయగూడెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ జగ్గారావు, అదే గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి బాలికగా పోలీసులు గుర్తించారు. వీళ్లిద్దరూ కనిపించడంలేదని కుటుంబసభ్యులు చండ్రుగొండ పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం మార్చురీకి తరలించారు.
Also Read: తన బంధువుల పెళ్లికి రానన్నాడని భర్తను కత్తితో పొడిచిన భార్య, చివరికి..
నిప్పుపెట్టిన యువకుడు మృతి
విశాఖ సూర్యాబాగ్ లో ప్రేయసిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన నిందితుడు హర్షవర్దన్ రెడ్డి మృతి చెందాడు. ఈ ఘటనలో తాను కూడా నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హర్షవర్దన్ పరిస్థితి విషమించి మంగళవారం ప్రాణాలు వదిలాడు. ఈ నెల 13న హర్షవర్ధన్ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత తానూ నిప్పుపెట్టుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. తన ప్రేమను నిరాకరించిందనే కారణంతోనే యువకుడు హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: రణరంగమైన బండి సంజయ్ పర్యటన.... అడుగడుగునా అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు...
యువడుకే నిందితుడు
విశాఖ సూర్యాబాగ్ లోని ఓ హోటల్ లో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన సంచలనం అయ్యింది. విశాఖకు చెందిన యువతి, తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి మంటల్లో కాలుతూ కనిపించారు. స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా కాలిపోయింది. హర్షవర్ధన్ రెడ్డికి కూడా తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన 4.15 గంటల సమయానికి జరిగితే పోలీసులకు 6.30 గంటలకు సమాచారం అందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో యువకుడే ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. యువతిని హత్య చేయాలనే ఉద్దేశంతో విశాఖ వచ్చినట్లు తేల్చారు. నిందితుడిపై హత్యాయత్నం పాటు ఆత్మహత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పెట్రోలు పోసి నిప్పంటించడానికి ముందు తనతో తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు యువతి పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు.
Also Read: గురువారం ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా .. వరి కొనుగోలుపై కేంద్రం తేల్చాల్సిందేనన్న కేసీఆర్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి