KTR with Gadwal Cotton Farmers | గద్వాల పత్తి రైతులతో కేటీఆర్
గద్వాల జిల్లాలో రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా కంపెనీలతో చర్చించి తగిన న్యాయం చేయాలన్నారు. సీడ్ కంపెనీల అక్రమాలతో మోసపోయిన గద్వాల జిల్లా రైతులు హైదరాబాద్ నందినగర్ లో కేటీఆర్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. సీడ్ కంపెనీలు చేసిన మోసంతో కుటుంబాలతో సహా రోడ్ల మీదకు వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ కంపెనీలు నేరుగా తమకు విత్తనాలను ఇవ్వకుండా ఆర్గనైజర్లు అనే దళారులను నియమించుకొని మాఫియాగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ కు తెలిపారు. ఈ సంవత్సరం తాము పండించిన సీడ్ ను గత సంవత్సరం కంటే తక్కువ ధరకు కొంటామని ఆర్గనైజర్లు, కంపెనీలు కొత్త మోసానికి తెరతీశాయని ఆరోపించారు. ఇంతేకాదు తాము పండించిన సీడ్ నాణ్యమైనది అయినప్పటికీ నాసిరకం అని, ల్యాబ్ టెస్ట్ లో ఫెయిల్ అయిందని అబద్దాలు చెపుతూ తమ డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కంపెనీలు తాము సొంతంగా పెట్టుకున్న GOT (Grow out Test) నిబంధనల ప్రకారం సీడ్ ను టెస్ట్ చేసి ఆ పంట ఫెయిల్ అయిందని చెపుతున్నారన్నారు. కానీ తాము పండించిన పత్తి విత్తనాలను ప్రయివేట్ ల్యాబ్ లో టెస్ట్ చేపిస్తే పాస్ అయినట్టు తేలిందన్నారు.





















