Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయం
అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో అడవి బిడ్డల సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అందరికన్నా భిన్నంగా ఉంటాయి. ఆదివాసిల్లోని తోటి తెగవారు పూర్వకాలం నుండి పెద్దలు పాటిస్తున్న ఆచార సంప్రదాయాన్ని కులవృత్తిగా నేటికీ కొనసాగిస్తూ తమ సంస్కృతికి జీవం పోస్తున్నారు. తోటి తెగవారిని బిరుదు గోండులు అని కూడా పిలుస్తుంటారు. వీరి కులవృత్తి చుక్కబోట్లు వేయడం.. కిక్రి.. డక్కి..వాయిద్యాలు వాయించడం.. పాటలు పాడడం.. ఆదివాసీల్లోని కొన్ని తెగలకు తరతరాలుగా తోటి తెగవారు చుక్కబొట్లు వేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇంతకీ తోటి తెగలోని ఆదివాసీలు చుక్కబొట్లను ఎలా వేస్తారు..? ఎలా తయారు చేస్తారు..? ఎవరికీ వేస్తారు...? ఈ సాంప్రదాయం ఎప్పటినుండి వస్తుంది..? ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీలో చూద్దాం. అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామానికి చెందిన తోటి తెగ ఆదివాసీలు.. తాత ముత్తాతల కాలంగా తమ కుల వృత్తిని నమ్ముకుని నేటికీ తమ సంస్కృతికి జీవం పోస్తున్నారు. తోటి తెగ ఆదివాసీలకు కిక్రి.. డక్కి.. వాయిద్యాలు వాయించడం అలాగే పచ్చబొట్లు (చుక్క బొట్లు) వేసే ఆచారం పూర్వీకుల నుండి కొనసాగుతూ వస్తోంది.