Darien Gap Crossing in Telugu | మానవ అక్రమరవాణాకు దారి చూపెడుతున్న మహారణ్యం | ABP Desam
ఎత్తైన కొండలు...భీకరమైన లోయలు…ఎటు చూసినా మోకాలిలోతు బురద ఉండే నేలలు...దట్టమైన అడవిలో విషం కక్కే పాములు..ప్రాణాలు తీసేసే క్రూర జంతువులు..మనిషి ఓ గంట సేపు అక్కడే నిలబడి బతకటమే కష్టం అక్కడ. అలాంటిది ఆ మహారణ్యంలో 15రోజుల పాటు సాగించే ప్రయాణం..97కిలోమీటర్ల నరకం. దాని పేరే డేరియన్ గ్యాప్. ఇదంతా ఎందుకు అంటే అనుమతులు లేకుండా అమెరికాలో అడుగుపెట్టాలంటే అక్రమంగా వెళ్లే మార్గం ఇదే.
రెండు రోజులుగా మన దేశంలో పార్లమెంటును సైతం కుదిపేస్తున్న విషయం ఏంటంటే...అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లిన వాళ్లను అక్కడి సైన్యం వెనక్కి పంపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక మొదటి సంతకం చేసింది అసలు ఎన్నిక కావటానికి ప్రధాన అస్త్రంగా ఎంచుకుందే వలసలను ఆపేస్తానని. అందుకే ట్రంప్ అధ్యక్షుడు కాగానే అక్రమ వలసదారులను వాళ్ల దేశాలకు తిప్పి పంపే ప్రణాళికలను అమలు పరుస్తున్నారు. అలా రెండు రోజుల క్రితం అమెరికా నుంచి అమృత్ సర్ లో 104మందితో దిగిన సైనిక విమానంలో ఎక్కువ మంది నోటి నుంచి వచ్చిన పేరు డేరియన్ గ్యాప్ నుంచి అమెరికాలోకి వెళ్లాం అని.
దక్షిణ అమెరికాను ఉత్తర అమెరికాను కలిపే సన్నటి దారి కి ముఖద్వారమే ఈ డేరియన్ గ్యాప్. దక్షిణ అమెరికాలోని కొలంబియాలోని ఉత్తర అమెరికాలోని పమానాకు వెళ్లాలంటే ఈ దట్టమైన అడవి ఒకటే మార్గం. అసలు ఈ ప్రాంతంలో అడవులను నరికేసి ఇక్కడ రైలు, రోడ్డు మార్గాలను నిర్మించాలనే ప్రతిపాదనలు వందల ఏళ్లుగా ఉన్నా పర్యావరణ పరంగా ఇక్కడ తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. అతి అరుదైన కునా జాతి తెగ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇప్పటికీ మాతృస్వామ్యం వ్యవస్థ చెలమాణీలో ఉన్న కునా తెగ ప్రజలు అంతరించిపోకుండా ఉండాలంటే డేరియన్ గ్యాప్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అందుకే అక్కడి ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని దట్టమైన అటవీ ప్రాంతంగానే వదిలేశాయి. కానీ స్మగ్లర్లు, మానవ అక్రమ రవాణా ముఠాలు, డ్రగ్స్ సరఫరా చేసే మాఫియాలకు డేరియన్ గ్యాప్ ఓ స్వర్గం.





















