Secunderabad - Goa Train: గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్ - నూతన రైలు సర్వీస్ ప్రారంభం, ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు
Telangana News: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ - వాస్కోడగామా (గోవా) బైవీక్లీ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
Secunderabad - Goa New Train Service Started: గోవా.. పర్యాటకులకు ఇష్టమైన ప్లేస్. ఇటీవల హైదరాబాద్ (Hyderabad) నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం గోవాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి గోవా (Goa) వెళ్లే ప్రయాణికులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవా (Secunderabad - Goa Train) వెళ్లేందుకు కొత్త ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఇప్పటివరకూ వారానికి ఓ రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఆ రైలు గోవాకు వెళ్లేది. అలాగే, కాచిగూడ - యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ 4 బోగీలు తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణించేవారు. ఇప్పుడు తాజాగా పర్యాటకుల సౌలభ్యం దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా (గోవా)కు బై వీక్లీ ఎక్స్ ప్రెస్ సర్వీసును ప్రారంభించనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది.
ఈ రూట్‌లో..
సికింద్రాబాద్ - గోవా మధ్య నూతన రైలు సర్వీసును అందుబాటులోకి తీసుకురావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ - గోవా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి,హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్ డెమ్, మడగావ్ జంక్షన్‌లో ఆగుతూ.. వాస్కోడగామా (గోవా) చేరుకుంటుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా (గోవా) నుంచి తిరిగి గురు, శనివారాల్లో తిరుగు ప్రయాణమవుతుంది.
ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు
సికింద్రాబాద్ నుంచి గోవాకు బైవీక్లీ కొత్త సర్వీస్ రైలు ప్రకటించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇటీవల సికింద్రాబాద్ - గోవా రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడంతో పాటు ప్రయాణికులు సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ మార్చి 16న రైల్వే మంత్రికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దీనిపై ఆలస్యమైంది. మూడోసారి కేంద్రంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి రావడంతో మరోసారి ఈ ప్రాజెక్టు విషయాన్ని రైల్వే మంత్రిని కలిసి విన్నవించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి సికింద్రాబాద్ నుంచి గోవాకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు చెబుతూ.. కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్
— G Kishan Reddy (@kishanreddybjp) July 6, 2024
తెలుగు రాష్ట్రాలనుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు… pic.twitter.com/tDwlqGedpb