Warangal News: ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా, తస్మాత్ జాగ్రత్త! పోలీసులు చెప్పిన సూచనలివీ
Warangal News: వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లే వారిని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెల్లడించారు.
![Warangal News: ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా, తస్మాత్ జాగ్రత్త! పోలీసులు చెప్పిన సూచనలివీ Warangal Cops Issue Advisory To People Who Going On Summer Holidays Warangal News: ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా, తస్మాత్ జాగ్రత్త! పోలీసులు చెప్పిన సూచనలివీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/18/e6b8bdfedf4e00af880252a9eb82db301684410240987754_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Warangal News: వేసవి వచ్చిందంటే అమ్మమ్మలు, నానమ్మల వద్దకు చాలా మంది వెళ్తుంటారు. మరికొంత మంది తీర్థయాత్రలు, ఇంకొంత మంది విహార యాత్రలకు వెళ్తుంటారు. ఏడాదంతా చదువులతో కుస్తీ పట్టిన పిల్లలు వేసవి సెలవుల్లో ఆహ్లాదంగా గడపడానికి తల్లిదండ్రులు టూర్లకు ప్లాన్ చేస్తుంటారు. తల్లిదండ్రులతో పాటు మరికొందరు కూడా తమ తమ ప్లాన్లతో బిజీగా ఉంటారు. ఏ ఇంటికి తాళం వేసి ఉంటే అదే వారి టార్గెట్. ఆ ఇల్లు గుల్ల చేసేస్తుంటారు. ఊర్లకు వెళ్లి తిరిగి వచ్చాకే చాలా మంది దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. కానీ అప్పటికే పుణ్యకాలం పూర్తయి పోతుంది.
వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లే వారిని వరంగల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఊరికి వెళ్లేవారు తస్మాత్ జాగ్రత్త అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్ విభాగం రూపొందించిన కరపత్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో గురువారం అవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ చోరీల నివారణకు ప్రజలకు పలు సూచనలు చేసారు.
Also Read: Jagtial ATM Theft : ఏటీఎం దొంగతానికి స్కెచ్...ట్విస్ట్ మాములుగా లేదు
* ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును భద్రపర్చుకోవాలని.
* బీరువా తాళాలు ఇంటిలోనే ఉంచకుండా తమ వెంట తీసుకొని పోవాలి.
* ఎక్కువ రోజులు విహార యాత్రలకు వెళ్తుంటే పేపర్, పాల వారిని రావద్దని ముందుగానే చెప్పాలి. పని మనిషి ఉంటే రోజూ ఇంటి ముందు శుభ్రం చేయమని చెప్పాలి.
* విలువైన వస్తువులు, వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పరాదు.
* ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టంను, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
* ఐపీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి స్థితిగతులను ఆన్‌లైన్ మొబైల్లోనే వీక్షించవచ్చు.
* ఎట్టి పరిస్థితుల్లో బయట గేటు తాళం వేయకూడదు. లోపలి నుండి బేడం పెట్టాలి.
* ఇంటి లోపల, బయల లైటు వేసి ఉంచాలి.
* అపార్ట్ మెంట్ లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి లేదా వాచ్ మెన్ ను నియమించుకోవాలి.
* సంబంధిత పోలీస్ స్టేషన్, ఏరియా కానిస్టేబుల్ సెల్ నంబర్లను దగ్గర ఉంచుకోవాలి.
* ప్రజలు పోలీసులు సమన్వయం కలిసి పని చేస్తే చోరీలను నియంత్రించవచ్చు.
* ఇళ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు ప్రక్కల వారికి, స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలి.
Also Read: Hyderabad: నల్ల కవరులో మహిళ తల! మొండెం వెతికినా జాడ లేదు - మలక్‌పేట్‌లో మిస్టరీగా కేసు
ఎవరైన కాలనీలో, అపార్ట్ మెంట్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద రీతిలో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా గమనిస్తే తక్షణమే స్థానిక పోలీసులుకు లేదా డయల్ 100 కు కాల్ చేయాలి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ 8712685294. క్రైమ్ డీసీపీ నంబర్ 8712685103, క్రైమ్ ఏసీపీ నంబర్ 8712685135, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ నంబర్ 8712685136 లకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమములో క్రైం డీసీపీ మురళీధర్, ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, క్రైం ఏసీపీ డేవిడ్ రాజు, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ తిరుమల్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్ పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)