Congress VH : కాంగ్రెస్‌లో అంబర్‌పేట రచ్చ - టిక్కెట్ తనవారికే ఇవ్వాలంటున్న వీహెచ్ !
అంబర్ పేట టిక్కెట్ తన అనుచరుడికే ఇవ్వాలని వీహెచ్ పట్టుబడుతున్నారు. వేరే అభ్యర్థిని సూచిస్తున్న ఉత్తమ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
Congress VH : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అంబర్ పేట టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ లో అలజడి రేపుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంబర్ పేట టిక్కెట్ విషయంలో ఇతరులను సిఫారసు చేస్తున్నాడని ఆయన రోజూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని.. కాంగ్రెస్ గెలవాలంటే బీసీలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. అంబర్ పేట టికెట్ విషయంలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో డబ్బులు తీసుకుని తాను పోటీ నుంచి తప్పుకున్నానని అపవాదు వేస్తున్నారని, ఇది తనను బాధిస్తోందన్నారు.
ఇప్పటి వరకు తానెప్పుడు ఎవరికి వ్యతిరేకంగా లేనని, బడుగు బలహీన వర్గాల వారి పక్షానే నేను నిలుస్తానన్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. నేను రెడ్లకు వ్యతిరేకం కాదన్నారు. అదే సమయంలో సామాజిక న్యాయం జరగాలన్నదే తన తాపత్రయం అని చెప్పారు. తాను గట్టిగా మాట్లాడితే పార్టీకి నష్టం జరుగుతుందనే మౌనంగా ఉంటున్నానని, కార్యకర్తలందరికీ న్యాయం జరగాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కుట్ర కోణం ఉందని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, ఇది సరైన పద్దతి కాదన్నారు. ఇకైనా తప్పును సరిదిద్దుకోవాలన్నారు. అంబర్‌పేట సీటు తాను సిఫారసు చేసిన వ్యక్తికి కాదని.. ఓబీసీ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్‌ను ఉత్తమ్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్‌గౌడ్ తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆరోపించారు.
అంబర్‌పేట సీటు తాను లక్ష్మణ్ యాదవ్‌కు అడుగుతున్నానని, గతంలో అక్కడ యాదవ్‌లు గెలిచిన చరిత్ర ఉందన్నారు. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా తనకు టికెట్ రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపేందుకు ఉత్తమ్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అంబర్‌పేట సీటు తనదని, తనకు దక్కకుండా చేస్తే.. తాను కూడా ఉత్తమ్ వెంట పడతానని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను బయటకు వెళ్లొగొట్టేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. అంబర్‌పేట వెంట పడుతున్నారన్న వీహెచ్.. ఆ సీటు తనదేనని.. ఇక్కడ వేలు పెడితే బాగోదని హెచ్చరికలు కూడా చేశారు.
గతంలో అంబర్‌పేట నుంచి గెలిచి తాను మంత్రినయ్యానని గుర్తు చేసుకున్నారు. ఉత్తమ్‌తో పాటు ఆయన భార్యకు మాత్రం సీట్లు కావాలి.. తనకు మాత్రం వద్దా అంటూ ప్రశ్నించారు. డబ్బులు తీసుకుని పోటీలో నుంచి వెనక్కి తగ్గుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో తన మనుషులు ఏలేటి మహేశ్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డిని ఉత్తమ్ బయటకు పంపారని.. తాజాగా జగ్గారెడ్డిని పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాను గాంధీ కుటుంబానికి విధేయుడినని.. ఎప్పటికీ పార్టీ మారబోనన్నారు. ఇప్పటికే ఉత్తమ్ తనకు వ్యతిరేకంగా పని చేయడం ఆపాలని.. లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేసిన పనులన్నీ బయటపడుతానని హెచ్చరించారు.