Covid Delta Variant: తెలంగాణలో డెల్టా ప్లస్ వేరియంట్ భయం.. ఆ కేసులు రాష్ట్రంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటన
ఇప్పటి వరకూ తెలంగాణలో డెల్టా ప్లస్ రకానికి చెందిన వైరస్ ఉనికి ఉందా లేదా అనే అంశంపై సందేహాలు ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఆ వేరియంట్ రాష్ట్రంలో ఉన్నట్లు స్పష్టం అయింది.
తెలంగాణలో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయని జనం కాస్త ఊరట చెందేలోపే.. కేంద్ర ప్రభుత్వం కాస్త ఆందోళన కలిగించే విషయాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ అయిన డెల్ట్ ప్లస్ వేరియంట్ తెలంగాణలో వెలుగులోకి వచ్చినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. మొత్తం తెలంగాణలో రెండు డెల్టా వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయని వివరించింది. జులై 23వ తేదీ నాటికే ఈ డెల్టా వేరియంట్ కేసులు తెలంగాణలో రెండు ఉన్నట్లుగా కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకూ తెలంగాణలో డెల్టా ప్లస్ ఉనికి ఉందా లేదా అనే అంశంపై సందేహాలు ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఆ వేరియంట్ రాష్ట్రంలో ఉన్నట్లు స్పష్టం అయింది.
అయితే, ఈ డెల్టా ప్లస్ రకానికి చెందిన వైరస్ సోకిన కేసులు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 70 గుర్తించినట్లు కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 23, మధ్యప్రదేశ్‌లో 11, తమిళనాడులో 10 డెల్టా ప్లస్ రకం కేసులు ఉన్నాయని వివరించింది. కరోనా వైరస్ ఇప్పటికే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లుగా మారింది. రెండో దశలో దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్ బీభత్సం రేపిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల గ్రాఫ్ ఒక్కపెట్టున ఎగబాకిపోయి ప్రజల్లో తీవ్రమైన భయాందోళన సృష్టించింది. ఇప్పుడు ఆ డెల్టా రకం మరికొన్ని మార్పులతో డెల్టా ప్లస్‌గా రూపాంతరం చెందింది. ఇది మూడో వేవ్‌కు దారి తీస్తుందేమోననే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నాయి.
రాష్ట్రంలో 614 కొత్త కేసులు
మరోవైపు, సాధారణ కరోనా కేసులు తెలంగాణలో 614 కొత్త కేసులు గుర్తించినట్లు శుక్రవారం (జులై 31) సాయంత్రం విడుదల చేసిన మీడియా బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో మొత్తం ఇప్పటి వరకూ కరోనా బాధితుల సంఖ్య 6,44,330కు చేరింది. కరోనా చికిత్స పొందుతూ ఒకే రోజులో మరో నలుగురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 3,800కు చేరింది. కరోనా నుంచి మరో 657మంది కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 6,31,389కు చేరింది. రికవరీ రేటు తెలంగాణలో 97.99 శాతం ఉండగా కరోనా వల్ల సంభవిస్తున్న మరణాల రేటు 0.58 శాతం ఉంది.
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,11,251 కరోనా పరీక్షలు జరిగాయి. వీటిలో నుంచే 614 కొత్త కేసులను గుర్తించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 73, కరీంనగర్‌లో 61, వరంగల్ అర్బన్‌లో 59, ఖమ్మం 47, నల్గొండలో 45 చొప్పున కేసులను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 9,141 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.
Also Read: Dalitha Bandhu Telangana: దళిత బంధు ఆగదు.. నన్ను చంపినా మోసం చేయను.. నొక్కి చెప్పిన కేసీఆర్