TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!
ఉద్యోగులకు డీఏ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం (జూన్ 1) ప్రకటించారు.

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు వినిపించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులకు మరో డీఏ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. జూన్ నెల జీతంతో కలిపి డీఏ చెల్లించనుంది. ఉద్యోగులకు డీఏ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం (జూన్ 1) ప్రకటించారు. జులై 2022 లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జూన్ నెల జీతంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల కీలక పాత్ర
సకల జనుల సమ్మె సహా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. అందుకే, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గిఫ్ట్ కింద పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను కూడా ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను టీఎస్ఆర్టీసీ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు అందనుందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఇటీవలే అంతర్జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటిన టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు
దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్‌లో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ప్రతిభ చాటారు. సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆర్చరీ (విలువిద్య) లో రెండు పతకాలను సాధించారు. జీడిమెట్ల డిపో కండక్టర్ ఎం.అంజలి ఆర్చరీ 18 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ గెలవగా, కరీంనగర్ జోనల్ వర్క్‌షాప్ మెకానిక్ కె. కిషన్ 30 మీటర్ల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరిగిన ఆలిండియా మాస్టర్స్ గేమ్స్‌లో వీరు సత్తా చాటారు. దీంతో ఇంటర్నేషనల్ ఆసియా-పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌కు ఎంపికయ్యారు. సౌత్ కొరియాలోని జియోన్‌బుక్‌లో మే నెల 12 నుంచి 20 వరకు ఈ పోటీలు జరిగాయి. వీరిద్దరి ప్రతిభను గుర్తించిన సంస్థ దక్షిణ కొరియాకు వారిని పంపించింది. దీంతో రెండు పతకాలు వీరు సాధించారు. తమను ఆర్టీసీ సంస్థే దక్షిణ కొరియా పంపించి ప్రోత్సహించినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఎండీ వీసీ సజ్జనార్‌కు ఎం.అంజలి, కె.కిషన్ కృతజ్ఞతలు తెలిపారు.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు రెండు పతకాలు సాధించడంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సంతోషం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన ఎం.అంజలి, కె.కిషన్‌లను బస్ భవన్‌లో సజ్జనార్ సత్కరించారు. అంతర్జాతీయ క్రీడల్లో రాణించి రెండు పతకాలు సాధించడం సంస్థకు ఎంతో గర్వకారణమని అన్నారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. భవిష్యత్ లో జరిగే పోటీల్లోనూ పాల్గొని సంస్థకు మంచి పేరు తీసుకురావాలని వారికి సూచించారు. నిరంతర కృషి, ప్రాక్టిస్‌తోనే క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు.
సౌత్ కొరియాలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఆసియా-పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌లో #TSRTC ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆర్బరీలో రెండు పతకాలను సాధించారు. జీడిమెట్ల డిపో కండక్టర్ ఎం.అంజలి ఆర్చరీ 18 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ గెలుపొందగా.. కరీంనగర్ జోనల్ వర్క్… pic.twitter.com/q2bxQkzpBT
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 30, 2023





















