Top 5 Headlines Today: ఒంగోలులో బాలినేని బలప్రదర్శన - ఇటు తెలంగాణలో బజరంగ్‌దళ్ సెగలు!
Top 5 Headlines Today 5th May 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి రోజా
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాపం పండిందని, త్వరలోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయంమని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం జరిగిన పుష్పాదివాసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో అమ్మవారికి పూజలు నిర్వహించగా.. మంత్రి రోజా గంగమ్మ వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని వెళ్లి తిరుమల దర్శనాన్ని పరిపూర్ణం చేసుకోవాలని అన్నారు. అంతే కాకుండా అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు చెప్పారు.
అమరావతి భూకుంభకోణంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసిన చంద్రబాబు నాయుడు పాపం పండిందని ఆరోపించారు. త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు స్వయానా పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అతని బతుకంతా అబద్దాలు, కుట్ర, హత్యా రాజకీయాలేనని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్ల పాటు చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేశారని, ఇకపై మ్యానేజ్ చేసేందుకు వీలుకాదని అన్నారు. చంద్రబాబు ఏం చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని, ఇప్పుడు అతని పాపం పండిందని, కనుకే సిట్ విచారణ చేస్తున్నారని ఏపి మంత్రి ఆర్.కే.రోజా అన్నారు. ఇంకా చదవండి
వైఎస్‌ఆర్‌సీపీ జెండాలు లేకుండానే ఒంగోలులో బాలినేని బలప్రదర్శన, అసలేంటి కథ..?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కొన్నిరోజులుగా ఒంగోలులో లేరనే విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆయన హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మధ్యలో సీఎం జగన్ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లికి వెళ్లి ఆయన్ను కలసి వచ్చారు. దాదాపు వారం రోజుల గ్యాప్ తర్వాత ఆయన ఈరోజు ఒంగోలుకి వచ్చారు. హైదరాబాద్, అమరావతి వెళ్లినప్పుడు తిరిగి ఆయన ఒంగోలుకు వచ్చేటప్పుడు పెద్దగా హడావిడి ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆయన రైలు దిగి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు వచ్చి నినాదాలు చేశారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ వీడియోలకు జై బాలయ్య సాంగ్ కలిపి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. బాలినేని అధికారిక ఫేస్ బుక్ పేజీలో కూడా ఈ వీడియో కనపడటం విశేషం. ఇంకా చదవండి
తెలంగాణలో బజరంగ్‌దళ్ సెగలు- కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయల వద్ద ఉద్రిక్తత
కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో సెగ తెలంగాణకు తాకింది. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ భగ్గుమంటోంది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీయే బహిరంగ సభల్లో నినాదాలు చేయించారు. కర్ణాటకలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణలో బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఆఫీస్‌ల ముందు హనుమాన్ చాలిసా పఠనానికి సిద్ధమయ్యారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బజరంగ్ దళ్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముట్టడికి ఆ సంస్థ కార్యకర్తలు యత్నించారు. ముందుగానే అక్కడకు చేరుకున్న పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ముట్టడికి వచ్చిన వారందర్నీ అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిజామాబాద్‌లో కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. నగరంలోని కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల ముందు హనుమాన్ ఛాలీసా చదవాలని పిలుపునిచ్చారు. దీంతో ముందుగానే పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముఖ్యమైన నేతలందర్నీ హౌస్ అరెస్టు చేశారు. మరి కొందరి స్పాట్‌లో అరెస్టు చేశారు. ఇంకా చదవండి
పొంగులేటి షరతులకు బీజేపీ తలొగ్గుతుందా ? ఖమ్మం నేత చూపు ఎటు వైపు ?
ఖమ్మం సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ టీం వచ్చి చర్చలు జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది సీట్లలో రెండు తప్ప ఎనిమిది సీట్లు రాసిస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన టెంప్ట్ అయ్యారో లేదో తెలియదు. తాజాగా బీజేపీ చేరిక కమిటీ కూడా చర్చలు జరిపింది. ఆయన కావాలనుకుంటే ఎనిమిది కాదు మొత్తం పది సీట్లు ఆయనకే ఇస్తామని ఆఫర్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీలో లోకల్ లో ఇచ్చే ఆఫర్లకు వాలిడేషన్ ఉండదు. హైకమాండ్ నుంచి రావాల్సిందే. మరి పొంగులేటి ఏం చేయబోతున్నారు ?
ఏడాదిగా పొంగులేటి అధికార బీఆర్ఎస్ కు దూరం జరుగుతూ వచ్చారు. తొలుత వైసీపీ టికెట్ పై ఖమ్మం ఎంపీగా గెలిచిన ఆయన 2019లో పోటీ చేయలేదు. తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు బీఆర్ఎస్ నాయకుల ఓటమిలో ఆయనే కారణమన్న ఆరోపణల నడుమ పార్టీ అధిష్టానం ఆయన్ను దూరం పెట్టింది. గతేడాదిగా పొంగులేటి కేసీఆర్ ప్రభుత్వంపై పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ విమర్శలు సంధిస్తూ వచ్చారు. తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ వేరు మనం వేరు అన్న ఫీలింగ్ తీసుకొచ్చారు. ఒకటి రెండు చోట్ల తన వర్గం తరపున అభ్యర్థులను ప్రకటించి దూకుడును ప్రదర్శించారు. ఆయనకు అన్ని నియోజకవర్గాల్లో అనుచరగణం ఉండటంతో పార్టీలో చేర్చుకునేందుకు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇంకా చదవండి
బటన్ నొక్కి కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
పేదింటి ఆడ పడుచుల పెళ్లి కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం జగన్ నేడు నిధులు విడుదల చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బటన్ నొక్కి మరీ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. జనవరి - మార్చి త్రైమాసికంలో వివాహాలకు చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింది రూ. 87.32 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు.
వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద పేదింటి ఆడపిల్లలను ఆర్థికంగా ఆదుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. పదో తరగతి చదవుకున్న వారికే కళ్యాణమస్తు, షాదీ తోఫాలు వర్తిస్తాయని స్పష్టంగా చెప్పామని అన్నారు. దీనివల్ల ఆడ పిల్లలను పదో తరగతి వరకూ చదివించాలన్న తపన ప్రతి పేద కుటుంబంలో కూడా మొదలవుతుందన్నారు. ఆడ పిల్లకు 18 ఏళ్లు ఉండాలి, అబ్బాయికి కచ్చితంగా 21 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన పెట్టినట్లు గుర్తు చేశారు. పదో తరగతి అయ్యేసరికి అమ్మాయికి 15 ఏళ్లు నిండుతుందని, ఆతర్వాత వివాహం కోసం మరో మూడేళ్లు ఆగాల్సి వస్తుందిని అన్నారు. అందువల్ల నేరుగా ఇంటర్మీయడిట్‌కు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎలాగూ ప్రభుత్వం అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన కూడా అందిస్తున్నాం కాబట్టి పిల్లలు డిగ్రీ వరకూ చదువుకునే అవకాం ఉంటుందన్నారు. ఇంకా చదవండి
చంద్రబాబుపై సజ్జల చేసిన కామెంట్స్‌పై బొత్స అసహనం - అసలేం జరిగిందంటే ?
బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో అత్యంత సీనియర్. దిగువ స్థాయి నుంచి ఎదిగారు. వైఎస్ఆర్‌సీపీలో కూడా ఆయన సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణఆరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ కామెంట్స్ కూడా చంద్రబాబును ఉద్దేశించి చేసినవి కావడంతో వైఎస్ఆర్‌సీపీలో చర్చ జరుగుతోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు కూడా త్వరలో అరెస్ట్ అవుతారని సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రోజుల కిందట వ్యాఖ్యానించారు. వీటిపై రాజకీయ దుమారం రేగింది. రోజా, జోగి రమేష్ సహా చాలా మంది మంత్రులు అదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ బొత్స సత్యనారాయణకు మాత్రం అలా అనడం నచ్చలేదు. సజ్జల తరహాలో తానైతే కామెంట్స్ చేయనని స్పష్టం చేశారు. పూర్తి ఆధారాలు ఉంటే ఎవరికయినా చట్టం వర్తిస్తుందని ..ఎవ్వరూ చట్టానికి అతీతలుగా ఉండే పరిస్దితి లేదన్నారు. అలాంటిది చంద్రబాబు అయినా వేరెవరయినా సరే ఇదే వర్తిస్తుందన్నారు.
అయితే పొలిటికల్ గా కీ రోల్స్ లో ఉన్న వారు ఇలాంటి కామెంట్స్ చేస్తే రాజకీయంగా అది అవతల వ్యక్తులకు ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయిని బొత్స విశ్లేషించారు. ఇంత చిన్న లాజిక్ ను సజ్జల ఎలా మిస్ అయ్యారో తనకు అర్దం కావటం లేదని బొత్స అసహనం వ్యక్తం చేశారు. అందులోనూ చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తామని, రాజకీయంగా అధికారంలో ఉన్న నేతలు ప్రకటిస్తే, దాన్ని తన అవసరానికి వినియోగించుకొని సానుభూతి ని క్రియేట్ చేసుకోవటంలో చంద్రబాబు సిద్దహస్తుడని బొత్స అభిప్రాయం. సజ్జల వ్యాఖ్యల వల్ల అలాంటి పరిస్దితులను మనమే క్రియేట్ చేసి పెట్టిన వారమవుతామని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా చదవండి