గంభీర్-గిల్ వల్లే అంతా! ఇలా అయితే సిరీస్ కూడా కష్టమే!
ఆస్ట్రేలియాతో ఫస్ట్ వన్డేలో ఇండియా ఓటమికి వెతికే కొద్దీ కారణాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ కారణాలన్నింటి వెనక కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ తీసుకున్న ఆలోచన లేని నిర్ణయాలుండటమే ఇప్పుడు ఫ్యాన్స్‌తో పాటు చాలామంది క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌కి చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో గంభీర్, గిల్ డ్యుయో చేసిన మార్పుల వల్లే జట్టు భారీ స్కోర్ చేయలేకపోయిందనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో అక్షర్ పటేల్ వికెట్ పడిన తర్వాత ఆ సమయంలో జట్టుకు అత్యవసరంగా వేగంగా పరుగులు కావాలి.
అలాంటి టైంలో పవర్ హిట్టింగ్‌తో బౌండరీలు బాదే నితీశ్ కుమార్ రెడ్డి లాంటి బ్యాటర్‌ని దించాలి. కానీ గంభీర్, గిల్ బాగా ఆలోచించి.. వాషింగ్టన్ సుందర్‌ను పంపించారు. సుందర్ మంచి టెక్నిక్ ఉన్న బ్యాటర్ అయినప్పటికీ.. అంత ఒత్తిడి సమయంలో ధాటిగా ఆడే పవర్‌హిట్టర్ కాదు. అందుకే అనవసర షాట్లకు ట్రై చేసి.. 10 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి ఫెయిలయ్యాడు. ఎంతో ముఖ్యమైన చివరి ఓవర్లలో ఇలా నెమ్మదిగా ఆడడం భారత స్కోరు వేగాన్ని పూర్తిగా తగ్గించేసింది. ఇక నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌కి వచ్చే టైంకి 24వ ఓవర్ నడుస్తోంది. అప్పటికే చాలా బంతులు వేస్ట్ అయిపోయాయి.
ఇంకోవైపు టెయిలెండర్లు ఒకరి తర్వాత ఇంకొకరు అవుట్ అవుతుండటంతో.. సింగిల్స్ తీయడానికి కూడా నితీష్‌కి చాన్స్ లేకుండా పోయింది. దాంతో నితీష్ తన సహజమై ఆటను ఆడలేకపోయాడు. అయినా చివర్లో పోరాడి చివరి ఓవర్లో 2 అద్భుతమైన సిక్సర్లు బాది 11 బంతుల్లో 19 పరుగులు చేసి.. భారత్ స్కోరుని 136కు చేర్చాడు. ఒకవేళ అతడిని ముందుగానే పంపి ఉంటే టీమిండియా సులువుగా 150-160 పరుగుల మార్కును దాటి ఉండేదనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఈ విషయంలో గిల్, గంభీర్ కంప్లీట్‌గా ఫెయిలయ్యారని కోప్పడుతున్నారు ఫ్యాన్స్. ఇక దీనితో పాటు టీమ్‌లో ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా.. కుల్దీప్ ఉన్నా కూడా అతడిని యూజ్ చేసుకోకుండా.. ఆడటంతో ఆసీస్ బ్యాటర్లని కట్టడి చేయడంలో బౌలింగ్ కూడా ఫెయిల్ అయింది. వీటన్నింటకీ గంభీర్, గిల్ డ్యుయోనే కారణమని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.





















