RK Roja: త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి రోజా
Minister RK Roja:టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళ్తారని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఆయన పాపం పండిందంటూ కామెంట్లు చేశారు.
Minister RK Roja: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాపం పండిందని, త్వరలోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయంమని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం జరిగిన పుష్పాదివాసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో అమ్మవారికి పూజలు నిర్వహించగా.. మంత్రి రోజా గంగమ్మ వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని వెళ్లి తిరుమల దర్శనాన్ని పరిపూర్ణం చేసుకోవాలని అన్నారు. అంతే కాకుండా అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు చెప్పారు.
అమరావతి భూకుంభకోణంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసిన చంద్రబాబు నాయుడు పాపం పండిందని ఆరోపించారు. త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు స్వయానా పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అతని బతుకంతా అబద్దాలు, కుట్ర, హత్యా రాజకీయాలేనని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్ల పాటు చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేశారని, ఇకపై మ్యానేజ్ చేసేందుకు వీలుకాదని అన్నారు. చంద్రబాబు ఏం చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని, ఇప్పుడు అతని పాపం పండిందని, కనుకే సిట్ విచారణ చేస్తున్నారని ఏపి మంత్రి ఆర్.కే.రోజా అన్నారు.
స్టిక్కర్ల విషయంలో కామెంట్లపై మండిపడ్డ మంత్రి రోజా
ఇటీవలే వైసీపీ స్టిక్కర్ల ప్రచారంపై ఇటీవల పవన్ విమర్శలు చేశారు. రుషికొండ తవ్వకాలు కనిపించకుండా 151 అడుగుల స్టిక్కర్లు అతికిస్తారా? అని ఎద్దేవా చేశారు. ఈ కామెంట్స్ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పవన్ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు వత్తాసుపలుకుతున్నారన్నారు. గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు ఇటీవల కంచె వేశారని తెలిపారు. ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్ చూసి టీడీపీ అధినేత చంద్రబాబుకు భయపట్టుకుందని మంత్రి రోజా విమర్శించారు. టీడీపీ, జనసేన చాటుమాటుగా వాళ్లు స్టిక్కర్లు వేస్తున్నారని మండిపడ్డారు. పది ఇళ్లకు స్టిక్కర్లు వేసుకున్నంత మాత్రాన ప్రజామద్దతు ఉండదన్నారు. చంద్రబాబు టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ తీసుకుని సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారన్నారు. టీడీపీ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో పై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. చంద్రబాబు రాజకీయం అంతా వెన్నుపోటులతో నడిచిందన్నారు. 2024లో జగనన్న వన్స్ మోర్ అని మంత్రి రోజా అన్నారు.
ఇదే నా సవాల్
"మా నగరిలో లేదా మీ కుప్పంలో ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో చూద్దామా? ఇదే నా సవాల్. ఈ సవాల్ తీసుకుంటావా చంద్రబాబూ? రాజకీయాల్లో వంద శాతం సంతృప్తి చేయగలమా? అనే డౌట్ ఉండేది. కానీ జగన్ పాలనలో చేసి చూపించారు. మెగా సర్వే చేయటానికి దమ్ము ఉండాలి. సీఎం జగన్‌కు దమ్ముంది. తన పాలనపై నమ్మకం ఉంది. అందుకే ఏడు లక్షల మంది సర్వేలో పాల్గొంటున్నారు. ప్రజలంతా మాకు మద్దతు తెలుపుతున్నారు. వాలంటీర్లంతా జగన్ సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఆయన మీద నమ్మకంతో అన్ని వర్గాల వారు ఉన్నారు. గతంలో ఏ ఆఫీసు చుట్టూ తిరిగినా పని జరగలేదని జనం చెప్తున్నారు. ఇప్పుడు జగన్ పాలనలో ఇంట్లో నుంచి బయటకు రాకుండానే వాలంటీర్లు చేసి పెడుతున్నారని చెప్తున్నారు. అందుకే జగన్ సైన్యం అంటే ప్రజలకు అంత ప్రేమ"- మంత్రి రోజా