(Source: Poll of Polls)
తెలంగాణలో బజరంగ్‌దళ్ సెగలు- కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయల వద్ద ఉద్రిక్తత
తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల ముందు హనుమాన్ చాలీసా పఠనానికి బజరంగ్ దళ్ కార్యకర్తల యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.
కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో సెగ తెలంగాణకు తాకింది. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ భగ్గుమంటోంది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీయే బహిరంగ సభల్లో నినాదాలు చేయించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణలో బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఆఫీస్‌ల ముందు హనుమాన్ చాలిసా పఠనానికి సిద్ధమయ్యారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బజరంగ్ దళ్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముట్టడికి ఆ సంస్థ కార్యకర్తలు యత్నించారు. ముందుగానే అక్కడకు చేరుకున్న పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ముట్టడికి వచ్చిన వారందర్నీ అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిజామాబాద్‌లో కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. నగరంలోని కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల ముందు హనుమాన్ ఛాలీసా చదవాలని పిలుపునిచ్చారు. దీంతో ముందుగానే పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముఖ్యమైన నేతలందర్నీ హౌస్ అరెస్టు చేశారు. మరి కొందరి స్పాట్‌లో అరెస్టు చేశారు.
పోలీసులు అరెస్టు చేసిన బీజేపీ నేతలు వెనక్కి తగ్గలేదు. రోడ్డుపైనే బైఠాయించి హనుమాన్ ఛాలీసా పారాయణం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు బీజేపీ లీడర్లు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.పోలీస్ స్టేషన్ ఎదుట బిజెపి నాయకులు హనుమాన్ చాలీసా పటిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
జగిత్యాలలో కూడా ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ముందు హనుమాన్ చాలీసా పఠించేందుకు బీజేపీ యత్నించింది. వారిని పోలీసులు అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు తోపులాట జరిగింది.