Vizag Modi Speech : చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
Modi: చంద్రబాబు లక్ష్యాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ విశాఖలో భరోసా ఇచ్చారు. విశాఖ బహిరంగసభలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Vizag Modi Speech : ఆంధ్రప్రదేశ్‌పై తన అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. విశాఖలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత ఆయన ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోదీ మొదట ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు చెప్పారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు స్పీచ్‌తో సిక్సర్ కొట్టారని ప్రశంసించారు. 60 ఏళ్ల తర్వాత దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు.
ఏపీ ప్రజల ఆశయాలకు మద్దతుగా ఉంటా !
రాష్ట్రంలో చంద్రబాబు లక్ష్యాలకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని భరోసా ఇచ్చారు. ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా ఇస్తామని ప్రకటించారు. ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామని భరోసా ఇచ్చారు. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని వెల్లడించారు. దీంతోపాటు ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని జోస్యం చెప్పారు. ఈ ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
పట్టణీకరణకు ఏపీ ఓ సాక్ష్యం
2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే మా లక్ష్యమని ప్రధాని ప్రకటించారు. నవ పట్టణీకరణకు ఏపీ సాక్ష్యంగా మారబోతోందన్నారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ చాలా కాలంగా ఉందని, చిరకాల కోరిక ఈరోజు నెరవేరిందన్నారు. రైల్వే జోన్ రాకతో వ్యవసాయంతోపాటు అనేక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఏపీ అభివృద్ధి మా విజన్ అని మోదీ స్పష్టం చేశారు. దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు వస్తుంటే.. అందులో ఒకటి విశాఖకు కేటాయించామన్నారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేశాం. 3 రాష్ట్రాల్లోనే ఇలాంటి బల్క్ డ్రగ్ పార్కులు వస్తున్నాయి. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో క్రిస్ సిటీ భాగం అవుతుందన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్ కీలకం
ఇప్పటికే శ్రీసిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ఊపందుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశాం. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్ కీలకం కానుంది. రైల్వే జోన్ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. రైల్వే జోన్ వల్ల వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని మోదీ భరోసా ఇచ్చారు.
Also Read: విశాఖలో ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఇవే- లోకేష్ నమో నమః స్పీచ్