Sujeeth Letter: పవన్ కళ్యాణ్ 'ఓజీ' దర్శక నిర్మాతల మధ్య గొడవలు - క్లారిటీ ఇచ్చిన సుజీత్!
Pawan Kalyan's OG Director Sujeeth: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'ఓజీ' తీసిన ఆయన వీరాభిమాని సుజీత్, ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య మధ్య గొడవలు జరిగాయా? ఆ పుకార్లకు లేఖతో చెక్ పెట్టారు దర్శకుడు.

Sujeeth Gives Clarity On Rumours: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఆయన వీరాభిమానులలో ఒకరైన సుజీత్ దర్శకత్వం వహించిన 'ఓజీ' సినిమా అభిమానులతో పాటు ప్రేక్షకులను మెప్పించింది. థియేటర్లలో సినిమాకు మంచి స్పందన లభించింది. వసూళ్లు సైతం 300 కోట్లు దాటాయి. అయితే ఈ సినిమా విడుదల తర్వాత దర్శక నిర్మాతల మధ్య గొడవలు అంటూ ఒక పుకారు షికారు చేస్తోంది. అసలు ఆ ప్రచారంలో ఏముంది? ఆ ప్రచారం పట్ల దర్శకుడు సుజీత్ ఏమని స్పందించారు? అనే వివరాల్లోకి వెళితే...
'ఓజీ' బడ్జెట్ ఎక్కువ అయ్యింది...
దాంతో దర్శక నిర్మాతల మధ్య గొడవ!
'ఓజీ' విడుదలకు ముందు నుంచి సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళను సినిమా మెప్పించింది. డిస్ట్రిబ్యూటర్లు కొన్న రేటు కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. దిల్ రాజు తమకు లాభాలతో పాటు ఎనర్జీ ఇచ్చిన సినిమా అని చెప్పుకొచ్చారు. అభిమానులతో పాటు దర్శక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు సంతోషాన్ని అందించిన సినిమా 'ఓజీ' అని భావిస్తున్న తరుణంలో సినిమాపై ఓ పుకారు గుప్పుమంది.
సినిమా క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేయడానికి నిర్మాత డీవీవీ దానయ్యను ఎక్స్ట్రా ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలని దర్శకుడు సుజీత్ డిమాండ్ చేశారని, దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయని సదరు పుకార్ల సారాంశం. వాటిని సుజీత్ ఖండించారు.
మాటల్లో చెప్పలేను... ఎంతో సపోర్ట్!
'ఓజీ' మేకింగ్ విషయంలో నిర్మాత డీవీవీ దానయ్యతో పాటు చిత్ర బృందం తనకు ఎంతో మద్దతు ఇచ్చిందని, అది మాటల్లో చెప్పలేనని సుజీత్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేయడంతో ఆయన ఓ లెటర్ విడుదల చేశారు. ఆ లేఖలో పుకార్లను ఖండించారు. ''సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఓ సినిమాకు ఏం అవసరం అనేది ఆ చిత్ర బృందానికి మాత్రమే తెలుస్తుంది. అతి కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. నాపై నమ్మకం ఉంచిన, ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన డీవీవీ దానయ్య గారికి సదా కృతజ్ఞుడినై ఉంటాను'' అని సుజీత్ తెలిపారు.
Also Read: సుకుమార్ క్యాంపు నుంచి లేడీ డైరెక్టర్... ఆ సినిమాలో హీరో ఎవరంటే?
— Sujeeth (@Sujeethsign) October 21, 2025
'ఓజీ' నిర్మాణంలో ఉండగా న్యాచురల్ స్టార్ నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. అయితే ఆ మూవీ చేతులు మారింది. దానయ్య బదులు వెంకట్ బోయినపల్లి ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాంతో సుజీత్, దానయ్య మధ్య గొడవలు అనే ప్రచారం మొదలైంది. 'ఓజీ' యూనివర్స్ మాత్రం దానయ్య ప్రొడ్యూస్ చేస్తారని టాక్. ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేసిన 'ఓజీ'లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్, సుదేవ్ నాయర్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం.





















