(Source: ECI/ABP News/ABP Majha)
Telangana BJP : పొంగులేటి షరతులకు బీజేపీ తలొగ్గుతుందా ? ఖమ్మం నేత చూపు ఎటు వైపు ?
పొంగులేటి షరతులకు బీజేపీ అంగీకరిస్తుందా ?ఖమ్మం జిల్లా మొత్తం రాసిస్తుందా ?పొంగులేటి ఎందుకు డబుల్ గేమ్ ఆడుతున్నారు?
Telangana BJP : ఖమ్మం సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ టీం వచ్చి చర్చలు జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది సీట్లలో రెండు తప్ప ఎనిమిది సీట్లు రాసిస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన టెంప్ట్ అయ్యారో లేదో తెలియదు. తాజాగా బీజేపీ చేరిక కమిటీ కూడా చర్చలు జరిపింది. ఆయన కావాలనుకుంటే ఎనిమిది కాదు మొత్తం పది సీట్లు ఆయనకే ఇస్తామని ఆఫర్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీలో లోకల్ లో ఇచ్చే ఆఫర్లకు వాలిడేషన్ ఉండదు. హైకమాండ్ నుంచి రావాల్సిందే. మరి పొంగులేటి ఏం చేయబోతున్నారు ?
రెండు జాతీయ పార్టీలతో ఆడుకుంటున్న పొంగులేటి
ఏడాదిగా పొంగులేటి అధికార బీఆర్ఎస్ కు దూరం జరుగుతూ వచ్చారు. తొలుత వైసీపీ టికెట్ పై ఖమ్మం ఎంపీగా గెలిచిన ఆయన 2019లో పోటీ చేయలేదు. తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు బీఆర్ఎస్ నాయకుల ఓటమిలో ఆయనే కారణమన్న ఆరోపణల నడుమ పార్టీ అధిష్టానం ఆయన్ను దూరం పెట్టింది. గతేడాదిగా పొంగులేటి కేసీఆర్ ప్రభుత్వంపై పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ విమర్శలు సంధిస్తూ వచ్చారు. తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ వేరు మనం వేరు అన్న ఫీలింగ్ తీసుకొచ్చారు. ఒకటి రెండు చోట్ల తన వర్గం తరపున అభ్యర్థులను ప్రకటించి దూకుడును ప్రదర్శించారు. ఆయనకు అన్ని నియోజకవర్గాల్లో అనుచరగణం ఉండటంతో పార్టీలో చేర్చుకునేందుకు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.
ఆర్థిక బలం అదనపు అర్హత !
పొంగులేటి ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు పెట్టగలరు. ఆయనకు కార్యకర్తల బలం కూడా ఉంది. ఖచితంగా చెప్పాలంటే ఒక జిల్లా మొత్తం ఆయన చేతిలో ఉంది. అక్కడ కాంగ్రెస్ కు బలముంది. కావాలనుకుంటే బీజేపీ కొంతైనా బలాన్ని పుంజుకోగలదు. అందుకే కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఆయనకు గాలం వేస్తున్నాయి. పైగా ఖమ్మం గడ్డ మీద నుంచి బీఆర్ఎస్ తరపున ఒక్కరిని కూడా అసెంబ్లీ గడప తొక్కనివ్వబోనని పొంగులేటి శపథం చేశారు. అదీ ఆయన పట్టుదలకు నిదర్శనమని భావిస్తున్న ఆ రెండు పార్టీలు పొంగులేటి తమ వర్గంలో ఉంటే బావుండునని ఎదురు చూస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన వెంటనే కాంగ్రెస్ నేతలు ఆయన్ను సంప్రదించారు. రాహుల్ గాంధీ టీమ్ నేరుగా ఆయన్ను సంప్రదించింది. ఇప్పుడు బీజేపీ టీమ్ కూడా బతిమాలుతోంది.
రాజకీయ పరిణామాలను బట్టే పొంగులేటి నిర్ణయం
పొంగులేటి తొందరపడ దలచుకోలేదు. కాంగ్రెస్ ముందు ఆయన కొన్ని షరతులు పెట్టారు. ఈ షరతులపై ఖమ్మం జిల్లా సీనియర్ నేతలు భట్టి విక్రమార్క రేణుకా చౌదరి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందు పార్టీలో చేరాక టికెట్ల విషయం చూద్దామని వాళ్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో పొంగులేటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పొంగులేటి రెడ్డి సామాజికవర్గం నేత కావడంతో ఆయన ప్రాబల్యం ఖమ్మం జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం ఉంటుందని బీజేపీ లెక్కగడుతోంది. కాకపోతే పొంగులేటి డిమాండ్లను నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలి. కానీ బీజేపీ పెద్దలు ఇలాంటి ముందస్తు షరతులకు అంగీకరించరు. అందుకే పార్టీలో చేరికలు తేడా పడుతున్నాయి. చివరికి గెలిచే పార్టీలోకి వెళ్లాలని పొంగులేటి గట్టిగా అనకుునే అవకాశం ఉంది. అందుకే రాజకీయ పరిణామాల్ని బట్టి ఆయన పార్టీని ఎంచుకునే చాన్సులున్నాయి. ఎందుకంటే... ఇప్పుడు ఆయనకే ఆప్షన్లు ఉన్నాయి మరి !