Munugode KCR : మునుగోడులో కేసీఆర్ ప్రచారంపై డైలమా ! కేటీఆర్ ప్రచారంతోనే సరి పెడతారా ?
మునుగోడులో ప్రచారానికి కేసీఆర్ వెళ్లడంపై డైలమా కొనసాగుతోంది. శుక్రవారం నుంచి కేటీఆర్ ప్రచారం చేస్తారు.
Munugode KCR : మునుగోడు ఉపఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేస్తారా లేదా అన్నదానిపై టీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఉపఎన్నికలు ఖాయమని తెలిసిన తర్వాత కేసీఆర్ఓ బహిరంగసభలో ప్రసంగించారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత నుంచి ఆయన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చే పనిలో బిజీగా ఉన్నారు. ఉపఎన్నికల బాధ్యతను కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించారు. అయితే వీలు కుదిరినప్పుడల్లా తాను సమీక్ష చేస్తూనే ఉన్నారు. సర్వేలు, ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగా పార్టీ నేతలకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. అయితే మునుగోడు ప్రచారానికి కేసీఆర్ వస్తారా రారా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.
కేసీఆర్ ప్రచారంపై ఇప్పటికీ రాని స్పష్టత !
షెడ్యూల్ ప్రకటించిన వెంటనే.. కేసీఆర్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యూపీకి వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీలోనే వారం రోజుల వరకూ ఉన్నారు. బుధవారమే తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత మునుగోడు ఉపఎన్నికపై సమీక్ష చేశారు కానీ.. తన ప్రచారం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పార్టీ నేతలు రెండు బహిరంగసభలకు ప్లాన్ చేసుకున్నారు. ఉన్న పళంగా ఓ బహిరంగసభ నిర్వహించి.. ఆ తర్వాత ప్రచారం చివరి రోజున మరో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఎటూ తేల్చకపోతూండటంతో ... ఏం చేయాలా అని తర్జన భర్జన పడుతున్నారు.
ఉపఎన్నికల ప్రచారానికి కేటీఆర్ !
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మునుగోడులో విస్తృత ప్రచారం చేయనున్నారు. శుక్రవారం ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రచారం ముగింపు వరకూ తరచూ పర్యటించే అవకాశం ఉంది. హరీష్ రావు ఇప్పటికే అక్కడ ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇటీవల ఉపఎన్నికల్లో కేటీఆర్ పెద్దగా ప్రచారం చేయలేదు. దుబ్బాకతో పాటు తాను సిట్టింగ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో వచ్చిన ఉన్న హూజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన ఉపఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. మొత్తం బాధ్యతలను హరీష్ రావే చూసుకున్నారు. కానీ మునుగోడు విషయంలో మాత్రం ఆయన రంగంలోకి దిగారు. కేసీఆర్ ప్రచారానికి రావడం లేదని.. అదుకే కేటీఆర్ రంగంలోకి దిగారన్న అభిప్రాయం టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది.
మునుగోడు ఫలితం కేసీఆర్ ఇమేజ్‌పై ప్రభావం చూపకూడదనే !
ఈ ఉపఎన్నిక కాదు.. అసలు కేసీఆర్ సాధారణంగా ఉపఎన్నికల్లో ప్రచారం చేయరు. తప్పనిసరి అయితే తప్ప ప్రచారం చేయరు. అధికార పార్టీగా ఉండి ఉపఎన్నికల్లో ఓడిపోతే ఓ సమస్య .. సీఎం ప్రచారం చేసి మరీ ఓడిపోతే మరో సమస్య. అందుకే కేసీఆర్ దూరంగా ఉంటారని చెబుతారు. మునుగోడు ఉపఎన్నికల్లోనూ ఫలితం ఏకపక్షంగా ఉండే అవకాశం లేదు. హోరాహోరీగా సాగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలో.. మునుగోడులో ప్రచారం చేసి మరీ ఓడిపోతే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అందుకే కేసీఆర్.. ప్రచారానికి దూరంగా ఉండటమే మంచిదని టీఆర్ఎస్‌లో కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మిర్యాలగూడ ఆర్డీవోకు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు