Telangana: మినీ మాల్దీవులు లక్నవరం - మూడో ద్వీపం కూడా రెడీ - చూసొద్దామా ?
Laknavaram: తెలంగాణలో ఉన్న అద్భుతమైన టూరిజం స్పాట్‌లలో ఒకటి అయిన లక్నవరంలో మూడో ద్వీపాన్ని రెడీ చేశారు. అక్కడ 21 కాటేజీలు ఉన్నాయి.
Third island in Laknavaram with 21 cottages inaugurated: ఎటు వైపు చూసినా కనిపించే నీరు.. మధ్యలో ద్వీపం.. అక్కడ కొన్ని కాటేజీలు.. అక్కడ సేదదీరుతూంటే ఎలా ఉంటుంది. ఈ జీవితానికి ఇది మాత్రం చాలు అని ఎక్కువగా మాల్దీవుల గురించి ఊహించుకుంటూ ఉంటారు. కానీ అలాంటి అనుభూతి ఇచ్చేందుకు తెలంగాణలోనూ ఏర్పాట్లు ఉన్నాయి. కాకపోతే మాల్దీవులు సముద్రం చెంతన ఉంటుంది.. కానీ తెలంగాణలో ద్వీపాలు మాత్రం ఓ చెరువు ఒడ్డున ఉంటాయి. ఫీలింగ్ మాత్రం సేమ్ అనుకోవచ్చు.
ఎనిమిది ఎకరాల్లో లక్నవరం మూడో ఐలాండ్
తెలంగాణ పర్యాటక పరంగా మరో అడుగు ముందుకు వేసింది. పర్యాటకులకు స్వర్గధామంలా లక్నవరం జలాశయంలోని మూడో ద్వీపం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే సహజసిద్ధమైన అందాలతో వీక్షకులను ఓలలాడిస్తున్న ఈ పర్యాటక ప్రాంతానికి ఈ ద్వీపం మరో సూపర్ ఎట్రాక్షన్ గా మారింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం జలాశయంలో సుమారు ఎనిమిదెకరాల విస్తీర్ణంలో మూడో ఐలాండ్‌ను తెలంగాణ పర్యాటక శాఖ నిర్మించిది. ఫ్రీ కోట్స్ అనే సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ద్వీపంలో పచ్చని ఉద్యానవనాలను కూడా పెంచారు.
మొత్తం 22 కాలేజీలు - నాలుగు స్పెషల్ ఫ్యామిలీ కాటేజీలు
ఈ ద్వీపంలో మొత్తం 22 కాటేజీలున్నాయి. వాటిలో నాలుగింటిని కుటుంబ సభ్యులతో బస చేసేందుకు వీలుగా తీర్చిదిద్దారు. అలాగే స్విమ్మింగ్ ఫూల్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు స్విమ్మింగ్ ఫూల్స్ ఉన్నా.. నాలుగు మాత్రం లగ్జరీ కాటేజీలకు కేటాయించారు. రెస్టారెంటు, రెండు స్పాలు కూడా ఉన్నాయి. ఇందులో ఫ్రీ కోట్స్‌కు చెందిన సిబ్బందే సేవలు అందిస్తున్నారు. పూర్తిగా ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చేలా కాటేజీలు ఉంటాయి. ఇప్పటికే లక్నవరంలో తీగల వంతెన టూరిజానికి స్పెషల్ అట్రాక్షన్ ఉంది. ఇప్పుడు ఈ మూడో ద్వీపం.. పర్యాటకులను బాగా ఆకర్షిస్తుందని విశ్వసిస్తున్నారు.
మాల్దీవ్స్ వెళ్లిన అనుభూతి ఖాయమంటున్న తెలంగాణ పర్యాటక శాఖ
సముద్ర తీరాలు, సరస్సుల వద్ద పర్యాటకులు పడవలో ప్రయాణించాలని ఎంతగానో మురిసిపోతుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రామప్ప, పాకాల, లక్నవరం సరస్సుల్లో పర్యాటక శాఖ బోటులో ప్రయాణించే సౌకర్యం ఇక్కడ ఉంది. లక్నవరం మూడో ద్వీపంలో కాస్త ఎంజాయ్ చేయాలనుకుంటే తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌ను చూడవచ్చు. అక్కడకు వెళ్తే మాల్దీవులు వెళ్లిన అనుభూతి ఖాయమని అనుకోవచ్చు.