Telangana Panchayat Elections: మూడు దశల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు - అమల్లోకి కోడ్ - ఇదిగో పూర్తి షెడ్యూల్
Telangana SEC: తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు అయింది. నవంబర్ 26న నోటిఫికేషన్ వస్తుంది. మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుంది.

Telangana SEC has announced the schedule for Telangana Panchayat elections : తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 11న జరిగి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలై ఫలితాలు ప్రకటిస్తారు. రెండో, మూడో దశలు డిసెంబర్ 14, 17 తేదీల్లో జరుగనున్నాయి. ఈ ఎన్నికలు 545 మండలాలు, 12,733 గ్రామాల్లో జరిగి, రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నికుంటారు. 
నోటిఫికేషన్ గురువారం జారీ అయిన తర్వాత, అభ్యర్థులు నామినేషన్లు సమర్పించవచ్చు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మొదటి దశలో 200 మండలాలు, రెండో దశలో 200 మండలాలు, మూడో దశలో మిగిలిన 145 మండలాల్లో పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రతి దశలో అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమై, సాయంత్రం 5 గంటలకు ముందే ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల GO Ms 46 జారీ చేసి, SC, ST, BCలకు రిజర్వేషన్లు నిర్ణయించింది. కులాలు, జనాభా ఆధారంగా కేటాయింపులు జరిగి, మహిళలకు 50% రిజర్వేషన్లు లాటరీ విధానంతో ఖరారు చేశారు.
దఫాల వారీగా షెడ్యూల్:
- మొదటి దఫా: నామినేషన్ల స్వీకరణ – నవంబర్ 27 పోలింగ్ – డిసెంబర్ 11 (బుధవారం)
- రెండో దఫా: నామినేషన్ల స్వీకరణ – నవంబర్ 30 పోలింగ్ – డిసెంబర్ 14 (శనివారం)
- మూడో దఫా: నామినేషన్ల స్వీకరణ – డిసెంబర్ 3 పోలింగ్ – డిసెంబర్ 17 (మంగళవారం)
మూడు దఫాల్లోనూ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎస్ఈసీ ప్రకటించారు.
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాణి కుముదిని మంగళవారం సాయంత్రం వెల్లడించారు. తొలి విడత ఈనెల 27, రెండో విడత ఈ నెల 30, మూడో విడత డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీరణ ప్రారంభం అవుతుంది.… pic.twitter.com/ZfAJeLB0Yx
— ABP Desam (@ABPDesam) November 25, 2025
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు
ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నిమిషం నుంచే రాష్ట్రవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వ పథకాల ప్రకటనలు, శంకుస్థాపనలు, బదిలీలు, కొత్త నియామకాలు తదితర కార్యక్రమాలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో సుమారు 12,000కు పైగా గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నందున అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ప్రచార యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలతో గ్రామీణ తెలంగాణలో కొత్త నాయకత్వం ఆవిర్భవించనుందని, స్థానిక సమస్యల పరిష్కారంలో పంచాయతీల పాత్ర మరింత కీలకమవుతుంది.




















