Telangana Politics : కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలంతా ఢిల్లీలోనే - తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు చాన్స్ !
తెలంగాణ రాజకీయాలు ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారాయి. రెండు పార్టీల అగ్రనేతలు ఢిల్లీలో మకాం వేశారు.
Telangana Politics : తెలంగాణ లో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. రెండు జాతీయ పార్టీల నేతలు ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసింది. కీలక నేతలంతా హస్తినకు చేరుకుని పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చేరికలను ఎలా ప్రోత్సహించాలి.. పోయే వారిని ఎలా ఆపాలి.. పార్టీలోకి వచ్చే వారికి ఎలాంటి హామీలు ఇవ్వాలన్నదానిపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతల సందడి కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కూడా హైకమాండ్ పిలిపించడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ప్రారంభమయింది.
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ చేరుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా నేతలంతా ఏఐసీసీ కార్యాలయంకు వెళ్లారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు మరికొంత మంది ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరందరూ రాహుల్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశం కోసం.. అగ్రనేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు. ముందు ముందు తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయి.. గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్నదానిపై రాహుల్ గాంధీతో సమాలోచనలు జరిపే అవకాశం ఉంది.
ఢిల్లీకి బండి సంజయ్
మరో వైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. శనివారం వారిని బీజేపీ హైకమాండ్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, నడ్డా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ ఢిల్లీలోనే ఉండిపోయారు. ఆదివారం జేపీ నడ్డా తెలంగాణలోని నాగర్ కర్నూలు పర్యటనకు వచ్చారు. అయితే ఆ నేతలు మాత్రం తెలంగాణకు రాలేదు. మధ్యాహ్నం వరకు రాజగోపాల్ రెడ్డితో ఈటల మంతనాలు సాగించారు. ఆదివారం ఈ ఇద్దరు నేతలు తమ పార్టీ జాతీయాధ్యక్షుడి కార్యక్రమానికి కూడా హాజరుకాకుండా ఢిల్లీలోనే ఉండిపోవడంతో వివిధ రకాల ఊహాగానాలు చెలరేగాయి. పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత ఉండడం లేదని, అందరినీ కలుపుకోకుండా ముందుకెళ్తే గెలుపు కష్టమని చెప్పినా హైకమాండ్ పట్టించుకోవడం లేదని పూర్తి స్థాయిలో హామీ కూడా రావడం లేదని వారంటున్నారు. వీరి అంశంపై హైకమాండ్ .. బండిసంజయ్‌తో చర్చించే అవకాశం ఉంది.
త్వరలో రెండు పార్టీల్లో కీలక మార్పులు
ఎన్నికలు జగ్గర పడుతూ ఉండటంతో రెండు జాతీయ పార్టీల తెలంగాణ శాఖల్లో హడావుడి పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి పీఠం దక్కించుకోవాలని పోరాటం చేస్తున్న జాతీయ పార్టీల అగ్రనేతలు కూడా తమ స్థానిక నేతల్ని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాలు అప్పగిస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి బలమైన నాయకుల్ని ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వచ్చే కొద్ది రోజుల్లో రెండు పార్టీల్లోనూ కీలక నిర్ణయాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial