Saichand: సాయిచంద్ భార్యకు కీలక పదవి- వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియామకం
Folk Singer Sai Chand Wife Rajini: ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సాయిచంద్ భార్యకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ప్రటకన చేశారు.
Folk Singer Sai Chand Wife Rajini: ప్రముఖ జానపద గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో చనిపోవడం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో చురుగ్గా పాల్గొంటూ అందరి మన్నలను పొందిన సాయిచంద్ హఠాన్మరణం యావత్ తెలంగాణను కన్నీరు పెట్టించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయిచంద్ భార్య రజినీ సాయించంద్ కు కీలక పదవిని ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శుక్రవారం యువ నాయకులు కుసుమ జగదీష్, సాయి చంద్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం కేసీఆర్‌ను ఎంతగానో కలిచివేసిందని.. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు.
సాయిచంద్ భార్యకు కీలక పదవి..
సాయిచంద్ భార్య రజనీకి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సాయిచంద్ భార్య రజనీని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అలాగే ఆయన కుటుంబానికి రూ.1.50 కోట్ల రూపాయలను అందచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందని కేటీఆర్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. కాగా, ఈ ఆదివారం సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
Thank you cm sir @TelanganaCMO @KTRBRS @RaoKavitha
— Mittapalli Surender (@MittapalliSuri) July 7, 2023
కళాకారుల్ని కడుపున పెట్టుకొని కాపాడుతున్న మీరు మీ మంచి మనసుకి కోట్లాది కృతజ్ఞతలు సర్ https://t.co/wwYKtWPm3G
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేసిన సాయిచంద్ 39 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో మరణించారు. ఈ జూన్ 28న సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో సాయిచంద్ కు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను నాగర్ కర్నూల్ లోని గాయత్రి ఆసుపత్రికి తీసుకెళ్ళారు. సాయిచంద్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జూన్ 29న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రముఖ గాయకుడు సాయిచంద్ మరణించారు.
సాయిచంద్ మరణంతో తెలంగాణ రాష్ట్రం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు నేరుగా పరిచయం లేకున్నా ఆయన పాటతో పరిచయం ఉన్న వారందరూ సైతం కన్నీరుమున్నీరయ్యారు. వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలో వెంకటరాములు, మణెమ్మ దంపతులకు జన్మించాడు సాయిచంద్. ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయమైన రజనీని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు చరీష్ (చెర్రీస్), కుమార్తె నది ఉన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన తన తండ్రి లాగే ప్రజా సమస్యలపై పాటలు రాస్తూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజలను తన పాటలతో చైతన్యం చేసేవారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలపై రాసిన పాటలను ఆలపిస్తూ ప్రజలను ఉత్తేజితుల్ని చేశారు. మలిదశ తెలంగాణోద్యమంలో ఎన్నో ధూంధాం కార్యక్రమాలతో ప్రజల్లో తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని రగిలించారు. 2009 నుంచి 2023 వరకు జరిగిన అసెంబ్లీ సాధారణ, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తన ఆట పాటలతో ప్రచారంలో పాల్గొని పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 2021 డిసెంబరు 24న తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.