CM Revanth Reddy: తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ల పటిష్టతకు కొత్త విధానం - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Telangana News: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
CM Revanth Reddy Key Orders On Schools Development: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు ప్రభుత్వం సరికొత్త విధానంతో ముందుకెళ్లనుంది. రాబోయే మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సహా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని చెప్పారు.
అంగన్వాడీల్లో ప్లే స్కూళ్ల తరహాలోనే మూడో తరగతి వరకూ విద్యా బోధనకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. అంగన్వాడీలో విద్యా బోధన కోసం మరో టీచర్‌ను నియమించాలని కోరారు. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్‌లో పిల్లలు చదువుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ స్కూళ్లకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పిస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్ఆర్ ఫండ్స్‌తో విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యావేత్తల అభిప్రాయం తీసుకున్నాక ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్దేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ప్రతి నియోజకవర్గంలోనూ..
ప్రతి నియోజకవర్గంలోనూ 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్స్‌ను మినీ ఎడ్యుకేషన్ హబ్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో అధునాతన వసతులతో నాణ్యమైన విద్య అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను 'ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్' పేరుతో ఒకే చోట ఏర్పాటు చేయనున్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టులుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి వివరాలను సైతం సీఎం అడిగి తెలుసుకున్నారు.
Also Read: Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ - 2 పరీక్ష వాయిదా - ప్రభుత్వం కీలక నిర్ణయం, మళ్లీ ఎప్పుడంటే?