Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ - 2 పరీక్ష వాయిదా - ప్రభుత్వం కీలక నిర్ణయం, మళ్లీ ఎప్పుడంటే?
Telangana News: తెలంగాణలో గ్రూప్ - 2 పరీక్ష వాయిదా పడింది. ఆగస్ట్ 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షను డిసెంబరులో నిర్వహిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Group 2 Exams Postponed In Telangana: తెలంగాణలో (Telangana) నిరుద్యోగుల ఆందోళనతో గ్రూప్ - 2 పరీక్ష వాయిదా పడింది. డిసెంబరుకు పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 7, 8 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, డీఎస్సీ పరీక్షల క్రమంలో గ్రూప్ - 2 (Group - 2 Exam) వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. తమకు ప్రిపరేషన్‌కు సమయం లేదని వాదించారు. అయితే, ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ పరీక్షను ఎలాగైనా నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, నిరుద్యోగుల ఆందోళనల ఉద్ధృతం కావడంతో సర్కారు వాయిదాపై సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, 783 గ్రూప్ - 2 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022, డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేయగా.. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ, గ్రూప్ - 2 వెనువెంటనే ఉండడంతో పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ఆందోళనలు సైతం నిర్వహించారు. పరీక్ష వాయిదాతో పాటు పోస్టుల సంఖ్య కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడ్డ పరీక్ష తాజాగా.. మరోసారి వాయిదా పడింది. డిసెంబరులో పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని టీజీపీఎస్సీ (TGPSC) అధికారులు తెలిపారు.
కొనసాగుతోన్న డీఎస్సీ..
మరోవైపు, రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా 11,062 పోస్టులకు 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. ఆన్ లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఆగస్ట్ 5వ తేదీతో ముగియనున్నాయి.
Also Read: Revanth Reddy : పెట్టుబడుల కోసం అమెరికాకు రేవంత్ రెడ్డి - ఆగస్టు మొదటి వారంలో పయనం !