KCR: కేసీఆర్ చేతిలో చిన్నారి పేరుకు ఓ స్టోరీ ఉంది.. ఏంటో తెలుసా?
సీఎం కేసీఆర్ చేతిలో కనిపిస్తున్న చిన్నారి పేరు వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. ఈ చిన్నోడి పేరు కేటీఆర్.
సీఎం కేసీఆర్ చేతిలో కనిపిస్తున్న చిన్నారి పేరు వెనుక ఒక స్టోరీ ఉంది. ఈ చిన్నోడి పేరు కేటీఆర్. తమను కలిపిన పార్టీ రుణాన్ని తీర్చుకునేందుకు ఈ బుడ్డోడికి వాడి తల్లిదండ్రులు రాముడు (కేటీఆర్) అనే పేరు పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ స్వయానా ఈ పేరు పెట్టడం విశేషం..
రామడుగు మండలం ఎంపీపీ కలికేటి కవిత, లక్ష్మణ్ దంపతులకు 8 ఏళ్ల క్రితం వివాహం అయింది. పెళ్లి అయినప్పటి నుంచి వీరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. కొన్నేళ్లకు అవి పెరగడంతో వారు కలిసి ఉండలేమని భావించారు. విడాకులు తీసుకుందామని నిశ్చయించుకున్నారు.
ఇంతలో రెండేళ్ల క్రితం ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో రామడగు మండలం ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్న కలికేటి లక్ష్మణ్ ఎంపీటీసీ టికెట్ కావాలని అనుకున్నారు. తన తల్లికి ఎంపీటీసీ టికెట్ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను కోరారు. దీనికి ఎమ్మెల్యే ఒక షరతు విధించారు. విడిపోయిన భార్యతో కలిసి ఉంటే టికెట్ ఇప్పిస్తానని లక్ష్మణ్‌కు చెప్పారు. దీంతో లక్ష్మణ్ తన భార్యతో సంప్రదింపులు జరిపారు. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించడంతో విడిపోదామనుకున్న జంట కలిసింది. ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం.. లక్ష్మణ్ భార్య కవితకు ఎంపీటీసీ టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో కవిత విజయం సాధించి ఎంపీపీగా ఎన్నికయ్యారు.
అప్పటినుంచి వారిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇటీవలే వారికి కుమారుడు జన్మించాడు. తమను కలిపింది పార్టీయే కాబట్టి.. పార్టీ రుణాన్ని తీర్చుకోవాలనే ఆలోచన వారికి కలిగింది. తమ కుమారుడికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నామకరణం చేయించాలని.. రెండు నెలలుగా వేచి చూస్తున్నారు.
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం నాటి పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ వచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయనను కలిసి ఇదే విషయాన్ని అభ్యర్థించారు. వారి కోరిన మన్నించిన కేసీఆర్ వారి సంతానానికి “కేటీఆర్ (కలికేటి తారక రామారావు)" అని పేరు పెట్టారు. అదన్నమాట మన చిన్నోడి పేరు స్టోరీ.