Railway Hand Held Terminal : రైలులో టికెట్ లేకుండా ప్రయాణించే వారు ఇట్టే దొరికిపోతారు, టీసీల చేతికి అధునాతన యంత్రాలు
Railways : రైలులో టికెట్ లేకుండా ప్రయాణించే వారిని కనిపెట్టేందుకు రైల్వే శాఖ సాంకేతికను ఉపయోగిస్తుంది. ఇకపై టీసీలకు ఏ స్టేషన్ లో ఎన్ని టికెట్లు బుక్ చేసుకున్నారో, ఎంతే మంది రిజర్వేషన్ చేసుకున్నారో ఇట్టే సమాచారం అందిపోతుంది.
Railway Hand Held Terminal : రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు కొందరు ఘనులు. టికెట్ కలెక్టర్(టీసీ) వచ్చినప్పుడు టాయిలెట్స్ లో దాక్కోవడం, సీట్ల కింద నక్కేయడం చేస్తుంటారు. ఒకసారి టీసీ చెక్ చేసి వెళ్లిపోతే ఇంకా రాడులే అన్న ధీమాతో టికెట్లు లేకుండా ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఇక ఇట్టే పట్టుకునేలా సాంకేతిక తీసుకొచ్చింది. టికెట్ లేకుండా ప్రయాణించేవారి ఆటలు కట్టిపెట్టేందుకు హ్యాండ్ హెల్డ్ టెర్మినల్(HHT) యంత్రాలను టీసీలకు అందిస్తున్నారు. టికెట్ కలెక్టర్లు ఇప్పటి వరకూ ఛార్ట్ తిరిగేస్తే గానీ ఏ బోగీల్లో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో తెలిసేవి కాదు. నెక్ట్స్ స్టేషన్‌లో ఎన్ని బెర్తులు బుక్ అయ్యాయి, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనే వివరాలు రైలు కదిలితే తప్ప టీసీల చేతికి అందేవి కాదు.
Holiday Special Trains between #Secunderabad and #Tirupati ; #nanded and #Visakhapatnam @drmned @drmsecunderabad @drmhyb @drmgtl pic.twitter.com/5p8StTg3Bd
— South Central Railway (@SCRailwayIndia) April 13, 2022
హెచ్.హెచ్.టి యంత్రాలతో సులభంగా
ఇందువల్ల రిజర్వేషన్ చేసుకున్న వారెవరు, టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారెవరో తెలుసుకునేందుకు టీసీలకు పెద్ద ప్రశ్న. టీసీ కాసేపు కూర్చొని ఛార్ట్ తిరగేస్తేనే కానీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు టీసీలకు హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ యంత్రాలు అందిస్తుంది రైల్వే శాఖ. ఈ యంత్రాలు రైల్వే ప్రధాన సర్వర్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. దీంతో ఎక్కడ కొత్త టికెట్ బుక్ అయినా టీసీలకు సమాచారం అందుతుంది. దీంతో టికెట్ లేని ప్రయాణికులను టీసీలు సులభంగా గుర్తించవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.
గత ఏడాది రూ.111.52 కోట్ల ఆదాయం
2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై నమోదైన కేసుల ద్వారా రైల్వే శాఖకు రూ.111.52 కోట్ల ఆదాయం లభించింది. బుధవారం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్ టికెట్ చెకింగ్ అంశంపై సమీక్ష నిర్వహించారు. హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్‌ను టీసీలకు అధిక సంఖ్యలో అందించాలని ఆయన నిర్ణయించారు. దీంతో టికెట్ లేని ప్రయాణికుల సంఖ్య తగ్గుతుందని ఆయన అన్నారు. దీంతో రైల్వేకు ఆదాయం కూడా పెరుగుతుందన్నారు.
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే సికింద్రబాద్-తిరుపతి, నాందేడ్-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 15వ తేదీన టైన్ నం. 07433 సికింద్రబాద్-తిరుపతి మధ్య, 16న ట్రైన్ నం.07434 తిరుపతి-సికింద్రబాద్ మధ్య నడపనున్నారు. 15న ట్రైన్ నం.07082 నాందేడ్-విశాఖపట్నం మధ్య, 17న రైలు నం.07083 విశాఖపట్నం-నాందేడ్ మధ్య నడుస్తోంది.