Singareni Gold Mining: సింగరేణికి గోల్డెన్ ఛాన్స్.. చరిత్రలో తొలిసారిగా బంగారం, రాగి గనుల లైసెన్స్
Singareni Wins Gold Exploration License | వేలంలో పాల్గొన్న సింగరేణి సంస్థ కర్ణాటక దేవదుర్గ్ లోని బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ దక్కించుకుందని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు.

Singareni Wins Gold Copper Mine Exploration License | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాల మేరకు, సింగరేణి సంస్థ ఖనిజ రంగంలో కీలక ముందడుగు వేసింది. కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్ ప్రాంతంలో బంగారం, రాగి గనుల అన్వేషణకు సంబంధించిన లైసెన్సును సింగరేణి సంస్థ విజయవంతంగా దక్కించుకుంది. గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వేలంలో 37.75 శాతం రాయల్టీను కోట్ చేసిన సింగరేణి, ఎల్-1 బిడ్డర్‌గా నిలిచిందని సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. ఇది సింగరేణి సంస్థకు కీలక ఖనిజాల రంగంలో శుభారంభమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన దిశలో ఇతర రంగాల వైపు విస్తరించేందుకు ఇది మొదటి విజయం అని ఆయన చెప్పారు. వచ్చే ఐదేళ్లలో అన్వేషణ పూర్తిచేసే లక్ష్యంతో సింగరేణి ముందుకెళ్తుందన్నారు.
కర్ణాటకలో త్వరలోనే ఖణిజాల అన్వేషణ ప్రారంభం
దేవదుర్గ్ ప్రాంతంలోని బంగారం, రాగి ఖనిజాలు ఉన్న భూభాగంలో త్వరలోనే సింగరేణి సంస్థ అన్వేషణ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అన్వేషణ అనంతరం, తుది నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. కేంద్రం ఆ తర్వాత గనులను మైనింగ్‌కు వేలంలో ఉంచుతుంది. మైనింగ్ హక్కులు దక్కించుకున్న సంస్థలు, 37.75 శాతం రాయల్టీని గని ఆపరేషన్ గడువు పూర్తయ్యే వరకు సింగరేణికి చెల్లించాలి. ఈ అన్వేషణకు సుమారుగా రూ.90 కోట్లు వ్యయం కాగా, అందులో రూ.20 కోట్లను కేంద్రం సబ్సిడీగా అందించనుంది.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల ప్రశంసలు
ఈ ఘనతపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. బొగ్గు రంగంలో 136 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి, ఇప్పుడు కీలక ఖనిజాల రంగంలోనూ ముందంజ వేస్తుండటం గర్వించదగిన విషయం అని అన్నారు. భారతదేశంలో అగ్రగామిగా, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో నిలవాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సిఎండీ బలరామ్ ఈ విజయాన్ని ఉద్యోగుల కృషికి ఫలితంగా పేర్కొంటూ వారికి అభినందనలు తెలిపారు.
మూడు గనుల వేలాల్లో పాల్గొన్న సింగరేణి
కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మార్చి 13న 13 ఖనిజ గనుల అన్వేషణ లైసెన్సుల కోసం వేలాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి మూడు బ్లాక్లను ఎంచుకుని వాటిపై అధ్యయనం జరిపింది. వాటిలో:
మధ్యప్రదేశ్‌లోని పదార్ ప్రాంతంలో ప్లాటినమ్ గ్రూప్ ఎలిమెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరి వద్ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్
కర్ణాటక దేవదుర్గ్‌లో బంగారం, రాగి
ఈ మూడు గనుల కోసం ఈ నెల 13, 14, 19 తేదీల్లో ఆన్లైన్ వేలం జరిగింది. అందులో ఆగస్టు 19వ తేదీన కర్ణాకటలోని దేవదుర్గ్ గనుల అన్వేషణ లైసెన్సును సింగరేణి విజయవంతంగా సొంతం చేసుకుంది.






















