Hyderabad Crime News: హైదరాబాద్‌లో విగ్రహాల తరలింపులో విషాదాలు, కరెంట్ షాక్‌తో రెండు రోజుల్లో 9 మంది మృతి
Ganesh Idols Mishap | హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి విద్యుత్ తీగలు రథానికి తాకి 6 మంది చనిపోగా, సోమవారం రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో మరో ముగ్గురు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది.

Electrocution while shifting Ganesh Idol in Bandlaguda | హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడ ప్రాంతంలో గణేష్ విగ్రహాన్ని తరలించే సమయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్రాలీపై విగ్రహాన్ని తీసుకెళ్తున్న సమయంలో విద్యుత్ తీగలను కర్రతో పైకి లేపే ప్రయత్నంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే తరహాలో అంబర్‌పేట్ ప్రాంతంలో కూడా విషాద ఘటన నమోదైంది. రామ్ చరణ్ అనే యువకుడు గణేష్ విగ్రహాన్ని తరలిస్తూ విద్యుత్ తీగలను తొలగించబోతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్‌లో విగ్రహాల తరలింపులో వరుస విషాదాలు..
కేవలం రెండు రోజుల వ్యవధిలో హైదరాబాద్ నగరంలో మూడు విద్యుత్ ప్రమాదాలు జరిగి 9 మంది చనిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత ఆదివారం రాత్రి రామంతాపూర్‌లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా విద్యుదాఘాతానికి గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం ఇంకా మరువకముందే, ఇవే రకం మరిన్ని ఘటనలు చోటు చేసుకోవడం భయానకంగా మారింది. ఈ నేపథ్యంలో విగ్రహాల తరలింపు సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని అధికారులు తీవ్రంగా గుర్తుచేస్తున్నారు. విద్యుత్ తీగలు, హైటెన్షన్ లైన్‌ల సమీపంలో విగ్రహాలు లేదా భారీ వస్తువులు తరలించే ముందు విద్యుత్ శాఖ సహాయాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
రామంతాపూర్ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించగా, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ సహాయం ఎల్లప్పుడూ కుటుంబాలకు అండగా నిలుస్తుందని వారికి భరోసా ఇచ్చారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేదన్న విద్యుత్ శాఖ
హైదరాబాద్ సమీపంలోని మైలార్ దేవ్ పల్లి- బండ్లగూడ ప్రాంతంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై విద్యుత్ శాఖ స్పందించింది. దాదాపు 23 అడుగుల ఎత్తు గల విగ్రహాన్ని ట్రాలీపై తరలించేటప్పుడు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విద్యుత్ శాఖ వల్లే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే ఈ ఆరోపణలను TGSPDCL విద్యుత్ శాఖ ఖండించింది. ఈ అంశంపై స్పందించిన సూపరింటెండింగ్ ఇంజనీర్, విద్యుత్ శాఖ (రాజేంద్రనగర్ సర్కిల్) శ్రీ రామ్ మోహన్ తాను ఘటన ప్రదేశాన్ని పరిశీలించానని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మరణాలు జరిగాయని ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
అంతేగాక, ట్రాలీలో ఉన్న వ్యక్తులు అప్రమత్తంగా లేకపోవడం వల్ల ప్రమాదవశాత్తు కింద పడటమే గాయాలకు కారణమై ఉంటుందని వారు వెల్లడించారు. ప్రస్తుతం మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. పైన ఉన్న 33 కె.వి. విద్యుత్ లైన్ తెగడం, వేలాడడం, లేదా విద్యుత్ సరఫరా లో లోపం ఏర్పడినట్లు ఎక్కడా నమోదుకాలేదని విద్యుత్ శాఖ తెలిపింది. ఇది విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన కాదని, నిర్దిష్టంగా సమాధానం ఇచ్చింది.
ఈ ప్రమాద ఘటనపై ప్రజల్లో సందేహాలు తొలగించేందుకు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ స్వయంగా పరిశీలించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో రథాలు, విగ్రహాలు, భారీ వస్తువుల తరలింపు సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా విద్యుత్ శాఖతో సంప్రదించాలి అని విద్యుత్ శాఖ సూచిస్తోంది.






















